కరోనా వైరస్ కంటే కేసీఆర్ వైరసే డేంజర్ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి కరోనాకంటే ఆయనే డేంజర్ అంటూ ఎద్దేవా చేశారు. శాసనసభను రేవ్ పార్టీగా మార్చింది సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్  ఉప ఎన్నిక కోసం రెండోసారి సీఎం కేసీఆర్ సభ అంటేనే ఓటమిని ఒప్పుకున్నట్టేనని చెప్పారు. 

జానారెడ్డి గెలుపు ఆయన కంటే తెలంగాణ ప్రజలకే అవసరమని చెప్పారు. కల్లు కాంపౌండ్ లా మారిన అసెంబ్లీలోకి జానారెడ్డి ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు అవసరముందని అన్నారు. టీఆర్ఎస్ కు వామపక్షాల మద్దతు వెనుక కమర్షియల్ కోణం ఉందని తెలిపారు. 

బీజేపీలో బండి సంజయ్, కిషన్ రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని చెప్పుకొచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవొద్దని బీజేపీ చూస్తోందని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

కాగా.. మంగళవారం ఉదయం సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సీఈసీకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రజలను భయభ్రాంతులను చేస్తోందని ఆయన ఆరోపించారు.

అనుమతి లేని వాహనాల్లో వచ్చి డబ్బులు పంచుతున్నారని... స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సాగర్‌కు కేంద్ర బలగాలను పంపాలని ఆయన ఈసీని కోరారు.

విచ్చలవిడిగా డబ్బు పంపిణీ.. లోకల్ పోలీసులొద్దు: హాలియాలో కేసీఆర్ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు...

మెడికల్ ఎమర్జెన్సలో లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ ఎలా పెడతారని ఉత్తమ్ ప్రశ్నించారు. పేదలు కరోనా బారినపడేలా చేస్తే ఎలా అంటూ ఆయన నిలదీశారు. జనం ఎలా పోతే నాకేంటి రాజకీయం ముఖ్యమని కేసీఆర్ అనుకుంటున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.

సాగర్‌లో స్థానికేతర నాయకులను తక్షణమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. సీఎం ఒత్తిడితో అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. కలెక్టర్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంమని ఉత్తమ్ ఫిర్యాదు చేశారు.