టీజేఎస్‌తో కాంగ్రెస్ పొత్తు చర్చలు: అభ్యర్థుల ప్రకటనపై కోదండరామ్ అసంతృప్తి
టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో కాంగ్రెస్ నేత మల్లు రవి ఇవాళ భేటీ అయ్యారు. తెలంగాణ జనసమితితో పొత్తు విషయమై చర్చించారు. రేపటి వరకు ఏదైనా తేల్చాలని కాంగ్రెస్ ను కోదండరామ్ కోరారు.
హైదరాబాద్: టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సోమవారంనాడు భేటీ అయ్యారు. పొత్తులపై చర్చించారు. 24 గంటల్లో పొత్తులపై తేల్చాలని మల్లు రవిని కోదండరామ్ కోరారు. లెఫ్ట్, టీజేఎస్ లతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావించింది. లెఫ్ట్ పార్టీలతో పొత్తు చర్చలు సాగుతున్నాయి. అయితే అదే సమయంలో టీజేఎస్ తో కూడ పొత్తు చర్చలను ప్రారంభించింది.ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో మల్లు రవి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని ఆరు అసెంబ్లీ సీట్లను టీజేఎస్ కోరింది.
అయితే ఎన్ని సీట్లను కేటాయించే విషయమై కాంగ్రెస్ నుండి ఇంకా స్పష్టత రాలేదు. 24 గంటల్లో సీట్ల సర్ధుబాటుపై స్పష్టత ఇవ్వాలని కోదండరామ్ కాంగ్రెస్ నేత మల్లు రవిని కోరారు. పొత్తు చర్చలంటూనే తమకు సమాచారం లేకుండానే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంపై కోదండరామ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సీపీఐ, సీపీఎంలకు రెండేసీ అసెంబ్లీ సీట్లను ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సీట్ల సర్ధుబాటుపై లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. టీజేఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య చర్చల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు.
తెలంగాణలో ఈ దఫా బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు గాను భావసారూప్యత ఉన్న పార్టీలతో సీట్ల సర్ధుబాటును చేపట్టింది. ఈ క్రమంలోనే లెఫ్ట్, బీఎస్పీలతో పొత్తు పెట్టుకోవాలని భావించింది. లెఫ్ట్ పార్టీలతో పొత్తు చర్చలు సాగుతున్నాయి. బీఎస్పీ మాత్రం కాంగ్రెస్ తో కలిసి రాలేదు. టీజేఎస్ కు కొన్ని సీట్లు కేటాయించి పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
also read:లెఫ్ట్‌తో పొత్తు నష్టమే: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఈ క్రమంలోనే చర్చలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఏకపక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై కోదండరామ్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 9వ తేదీన విడుదలైంది. ఈ ఏడాది నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.