బీజేపీ నేతలతో టచ్‌లోకి మహేశ్వర్ రెడ్డి: కాసేపట్లో తరుణ్ చుగ్ తో భేటీ
కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఇవాళ న్యూఢిల్లీలో తరుణ్ చుగ్ తో మహేశ్వర్ రెడ్డి భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ తో భేటీ కానున్నారు. గురువారంనాడు ఉదయం మహేశ్వర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కొంత కాలంగా మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో నిన్న మహేశ్వర్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులు జారీ చేయడంపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ గా ఉన్న తనకు పీసీసీ షోకాజ్ నోటీస్ పంపడంపై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి రూల్స్ తెలియవన్నారు.
ఇవాళ ఉదయం హైద్రాబాద్ నుండి మహేశ్వర్ రెడ్డి న్యూఢిల్లీకి వచ్చారు. మహేశ్వర్ రెడ్డి తరుణ్ చుగ్ నివాసానికి రావడానికి ముందే తరుణ్ చుగ్ తో బండి సంజయ్ భేటీ అయ్యారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిక విషయమై చర్చించారు.
ఈటల రాజేందర్ తో కలిసి తరుణ్ చుగ్ నివాసానికి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. తరుణ్ చుగ్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన లేఖను తరుణ్ చుగ్ నివాసం వద్ద మీడియాకు మహేశ్వర్ రెడ్డి చూపించారు.
కొంతకాలంగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతారని ప్రచారం సాగుతుంది. పార్టలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ లో తనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదని భావించిన మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొంత కాలంగా బీజేపీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారు. ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.