తెలంగాణలో త్యాగం కాంగ్రెస్‌ది అయితే, భోగం మాత్రం బీఆర్ఎస్‌ది అంటూ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలపై చులకనగా మాట్లాడితే చురకలు పెడతామని కేటీఆర్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్‌ పార్టీపై విమర్శలు చేశారు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం కరోడ్‌పతులు అయ్యారని ఆరోపించారు. తెలంగాణలో త్యాగం కాంగ్రెస్‌ది అయితే, భోగం మాత్రం బీఆర్ఎస్‌ది అంటూ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. కేటీఆర్ .. ముందు గాంధీ కుటుంబ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని చురకలంటించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తయిన రాహుల్ గాంధీపై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. 

Also Read: ధరణి పోర్టల్ కేటీఆర్ మిత్రుడి కనుసన్నల్లోనే.. మన వివరాలన్ని విదేశీ వ్యక్తుల గుప్పిట్లో : రేవంత్ వ్యాఖ్యలు

బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని.. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో వున్నా, ఆమెను అరెస్ట్ చేయలేదని మధుయాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రకారం పరిపాలన వుంటుందని ఆయన తెలిపారు. రైతులను రైతు బంధు అంటూ బందిపోటు దొంగలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మధుయాష్కీ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే ఆధారాలతో రావాలని అప్పుడు తాము చర్చలకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కేసీఆర్ విస్మరించారని మధుయాష్కీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలపై చులకనగా మాట్లాడితే చురకలు పెడతామని కేటీఆర్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చారు.