సీపీఎంతో పొత్తుకు చివరి ప్రయత్నం: అభ్యర్థుల జాబితా ఆపాలన్న జానా, తమ్మినేని రియాక్షన్ ఇదీ...
బీఆర్ఎస్ ను ఓడించేందుకు వీలుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు విపక్షాలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ వ్యవహరశైలిపై లెఫ్ట్ పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి.
హైదరాబాద్:సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆదివారంనాడు ఫోన్ చేశారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలను నిలిపివేయాలని జానారెడ్డి కోరారు.అయితే జానారెడ్డి సూచనపై కుదరదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇదివరకే ప్రకటించారు.
ఇవాళ అభ్యర్ధుల జాబితాతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను తమ్మినేని వీరభద్రం ప్రకటించనున్నారు. దీంతో అభ్యర్ధుల ప్రకటనను నిలిపివేయాలని జానారెడ్డి తమ్మినేని వీరభధ్రానికి ఫోన్ చేశారు. సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ అనుసరించిన విధానంతో సీపీఎం తీవ్ర అసంతృప్తితో ఉంది.కాంగ్రెస్ తీరు అవమానకరరీతిలో ఉందని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.ఈ పరిస్థితుల్లో పొత్తు అవసరం లేదని ఈ నెల 1న జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ తీరుపై సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించారు. సీట్ల సర్దుబాటు, పొత్తు విషయమై కాంగ్రెస్ నాయకత్వం తీరుపై రాష్ట్ర కమిటీ సమావేశం చర్చించింది. ఒంటరిగా పోటీ చేస్తామని ఈ నెల 2వ తేదీన సీపీఎం ప్రకటించింది. ఇవాళ అభ్యర్ధుల జాబితాను విడుదల చేయడానికి అరగంట ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేశారు. సీట్ల సర్ధుబాటు విషయమై చర్చించారు. అభ్యర్థుల జాబితా విడుదల చేయవద్దని సూచించారు. అయితే ఒంటరిగా పోరు చేస్తామని తమ పార్టీ నిర్ణయం తీసుకుందని తమ్మినేని వీరభద్రం జానారెడ్డి చెప్పారు.
సీట్ల సర్దుబాటు విషయమై చొరవ తీసుకొనే విషయాన్ని జానారెడ్డి ప్రస్తావించారు. అయితే ఈ సమయంలో అభ్యర్థుల జాబితా విడుదల చేయకుండా ఆపలేమని జానారెడ్డికి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. జానారెడ్డితో ఫోన్ సంభాషణ పూర్తి చేసిన తర్వాత తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీపీఎం పోటీ చేసే స్థానాల్లో అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు.సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై సీపీఎం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు లెఫ్ట్ తో పొత్తుల విషయమై చేసిన వ్యాఖ్యలపై సీపీఎం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. also
read:14 మందితో సీపీఎం తొలి జాబితా విడుదల: చోటు దక్కింది వీరికే
రెండు రోజుల క్రితం సీపీఐ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చించారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానంతో పాటు ఓ ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం సీపీఐకి ఆఫర్ ఇచ్చింది. మునుగోడులో ఫ్రెండ్లీ పోటీ చేయాలని సీపీఐ కాంగ్రెస్ ముందు ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.ఈ రెండు పార్టీల పొత్తుపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.