హైదరాబాద్:పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

గూడూరు నారాయణరెడ్డితో బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లారని సమాచారం. అయితే ప్రత్యర్ధులు ఉద్దేశ్యపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారా ఈ ప్రచారంలో వాస్తవం ఉందా అనేది తేలాల్సి ఉంది.  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గూడూరు నారాయణ రెడ్డిని బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఆ పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలు కొంత ఇబ్బంది కల్గిస్తున్నాయి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ కుమార్ గౌడ్ బీజేపీలో చేరారు.

శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతిగౌడ్, ఆయన తనయుడు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. 

కార్పోరేటర్ల సీట్ల కేటాయింపు విషయంలో పీసీసీ నియమించిన ఎన్నికల కమిటీలపై కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన  కాంగ్రెస్  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  మెరుగైన ఫలితాలను సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది.