చెంచాగిరి చేసేవాళ్లకే పదవులిస్తరా ?

congress leader dasoju sravan written open letter to kcr
Highlights

  • కేసిఆర్ నయా నిజాం
  • కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తా అంటే కుదరదు
  • చీరి చింతకు కట్టాలన్న కేసిఆర్ మాటలు కేసిఆర్ కు వర్తించవా?
  • ఉద్యమకారులపై దాడులు చేసిన వారే ముద్దొస్తున్నరా?
  • ఉద్యమకారులను గాలికొదిలి ఉద్యమ ద్రోహులకు అందలం ఎక్కిస్తున్నారు

తెలంగాణ సిఎం కేసిఆర్ కు కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. గత రెండు మూడు రోజులుగా అసెంబ్లీ వేదికగా సిఎం కేసిఆర్ చేసిన ప్రసంగాలను ఎండగడుతూ శ్రవణ్ ఈ లేఖను సంధించారు. ఆయన రాసిన బహిరంగ లేఖను ఏషియానెట్ యదాతదంగా ప్రచురిస్తున్నది. 

 

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 
డా. శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ

చీమలు పెట్టిన పుట్టలో.. పాముల మెట్ట
 
గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి..,
 
అయ్యా..!
నిన్న అసెంబ్లీలో తమరు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ  కేవలం తెరాస మాత్రమే ఉద్యమం చేసింది, తెరాస వల్లనే తెలంగాణా వచ్చింది, తెరాస వారు మాత్రమే రైతు సమన్వయసమితిలో  సభ్యులుగా  ఉండే హక్కు ఉందని అనడం ఒక పచ్చిమోసం అంతే కాదు అతి పెద్ద తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని తమరు పరిహాసించడం మాత్రమే కాకుండా ప్రజా స్వామ్య వ్యవస్థ ను కించ పరచడమే. . రైతు సమన్వయ సమితిలలో తెరాస కార్యకర్తలు మాత్రమే ఉండాలని అన్న  వరుస చూస్తుంటే, రేపు ఫి రీయింబర్సుమెంట్ కావాలంటే తెరాస విద్యార్థి విభాగం లో సభ్యులు కావాలని, ఉద్యోగాలు కావాలంటే తెరాస యువజన విభాగంలో సభ్యులుగా ఉండాలనే వింత నిబంధన పెడతారేమోనని అనుమానం వస్తుంది.
 
తెలంగాణా ఉద్యమంలో ఝంజామారుతంలా సబ్బండ వర్ణాలు మేము సైతం అంటూ  ఊరు వాడా ఏకమై తెలంగాణా సాధించుకుంటే, ఇవ్వాళ  అంతా మేమే చేశానని చెప్పుకోవడం తెలంగాణా ఉధ్యమకారుల  ఆత్మబలిదానాలను చులకన చేయడమే!  సకలజనుల సమ్మెలు, ఉద్యోగుల సహాయ నిరాకరణలు, సాగరహారాలు, మిలియన్ మార్చిలతో ఇలా ఎన్నో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో ఎందరో సమిధలై తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ త్యాగాల చరిత్రను ఇవాళ కూకటి వేళ్లతో మీరు పెకిలించి ఒక సరికొత్త స్వార్దపూరిత బూటకపు చరిత్రకు శ్రీకారం చుట్టిన్రు.
 
రాజకీయ స్వార్ధంతో "దొంగల కు సద్దులు మోసినట్లు" మీరు తెలంగాణా ద్రోహలను అందలం ఎక్కిచ్చిన్రు. ఇవాళ తెరాస పరిస్థితి చూస్తే "చీమలు పెట్టిన పుట్టలో పాములు మెట్ట పెట్టినట్లు" కనిపిస్తుంది. కాని ఆనాడు ఉద్యమంలో ముందుండి పోరాడిన బడుగు బలహీన వర్గాల పిల్లల బతుకులు ఆగమై వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవాళ  తెలంగాణా ద్రోహుల అండతో మీరు అధికారపు అందలమెక్కి, "నేనే రాజు నేనే మంత్రి"  అన్న తరహాలో  రాజ్యాధికారం చలాయిస్తూ, మోసపూరిత విధానాలతో తెలంగాణా ప్రజల ఉద్యమ లక్ష్యాలను భగ్నం చేస్తూ తెలంగాణా ఎందుకు తెచ్చుకున్నామా... అని జనం బాధపడేస్ధాయికి  తమరి నియంతృత్వ పోకడ పెరిగింది. మీతో పాటు,  మీకు భజన చేసే ఉద్యమద్రోహులు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందినకాడికి దోచుకోవడం, దాచుకోవడం మినహా మరోటి లేదు.  
 
ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణా  ఇచ్చిన తల్లి సోనియాగాంధేనని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మీరు  కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఇప్పుడు  ప్రశ్నించడం, నోటికి వచ్చినట్లు తూలనాడటం  మీ రెండు నాల్కల ధోరణి కి నిదర్శనం కాదా? ఆనాడు తెలంగాణా ఉద్యమంలో పార్టీని సైతం ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నది నిజం అవునో కాదో... ఇవాళ మీతొ పాటే అధికారంలో ఉన్న ఆనాటి కాంగ్రెస్ నేతలు కేకే, డీయస్ లను అడిగితే తెలుస్తుంది.
 
రైతులకు రుణమాఫీ సక్రమంగ చేయకపోగా వారిని మద్దతు ధర అడిగిన పాపానికి బేడీలేయించి, జైళ్లలో కుక్కించిన ఘనత తమరిది. దాంతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక, మసి పూసి మారేడు కాయలు చేసినట్లు,  కొత్త ఎత్తులు వేస్తూ  రైతులపై తమరి దాష్టీకాలను మరిచిపోయేందుకు కుయుక్తులు పన్నుతూ ఇవాళ రైతు సమన్వయ సమితుల పేరిట సరికొత్త నాటకానికి తెరలేపిన్రు.
 
దాదాపు అన్ని రైతు సమన్వయ సమితుల్లో,  నిజమైన రైతుకు స్ధానం లేకుండా, తెరాస ప్రస్తుత శాసనసభ్యులకు చెంచాగిరి చేసే నాయకులతో నింపేసిండ్రు. పద్నాలుగు సంవత్సరాలుగా జబ్బల సంచి..చేతులజెండా పట్టుకుని  కలోగంజో తాగి  ఉద్యమంలో భాగస్వాములై తమరి వెంట నడిచిన పేద ఉద్యమ కార్యకర్తలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా, పక్కపార్టీలనుంచి అమ్ముడువోయి వచ్చిన ఎమ్మెల్యేల అనుచరులకు పదవులు కట్టబెడుతూ , నిఖార్సయిన, టీఆర్ఎస్  ఉద్యమకారులను, పేదరైతులను అవమానపర్చడం, వారి ఆత్మగౌరవం అణచివేసే విధంగా ప్రవర్తించడం మీ మోసపూరిత మరియు నియంతృత్వ విధానానికి అద్దంపడుతోంది. రైతు సమన్వయ సమితిలో స్ధానం కోసం ఎమ్మెల్యేలను బతిమాలుకోవడం, పైరవీలు చేయాల్సిరావడం అసలైన రైతుల దురదృష్టం!
 
ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రతివారికి సమాన ప్రాధాన్యం కల్పించాల్సిందిపోయి ఏకపక్షంగా ఫలానావారే రైతు సమన్వయ సమితిలో సభ్యులుగా ఉంటారని శాసనసభ సాక్షిగా ప్రకటించడం ఏ విధమైన విలువలకు నిదర్శనమో  తమరే చెప్పాలి. రైతు సమన్వయసమితి ఏర్పాటు చేసింది రైతుల సంక్షేమం కోసమా? లేక  తెరాస కార్యకర్తలకు ఉపాధికల్పించడం కోసమా తేల్చండి? ఈ అంశం మీద బహిరంగ చర్చ కు మీరు సిద్ధమా?
 
రైతు సమన్వయ సమితిల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి రానున్న ఎన్నికలలో అప్పనంగా ఓట్లు దండుకొనేందుకు, ఆయా గ్రామాలలో తెరాస కోసం పనిచేసే బూత్ కమిటీ ఏజెంట్లను తయారుచేయడం అధికార దుర్వినియోగమే అవుతుంది! అంబేధ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ, ఇవాళ తెలంగాణాలో నయా నిజాం చక్రవర్తిలా తమరు కల్వకుంట్ల రాజ్యాంగం అమలుచేస్తున్న  మీ తీరు “ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు”అన్న చందంగా ఉంది. మేం కొట్లాడినం, మాకే పదవులుండాలనేది,  ప్రజాస్వామ్య వ్యవస్ధలో సరికాదన్న కనీస అవగాహన మీకు లేకపోవడం దురదృష్టకరం.
 
తెలంగాణా రాకముందు టీఆర్ఎస్ వేరు. తెలంగాంణా వచ్చినంక టీఆర్ఎస్ వేరు. అయినా ఎన్నికల సమయంలో ఉద్యమపార్టీని కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా మార్చినమని మీరు ప్రకటించిన నాడే టీఆర్ఎస్ పాపపంకిలమైంది. అంతే కాదు, నికార్సైన ఉద్యమ కారులను కాదని, ఉద్యమద్రోహులను అందలమెక్కించిన నాడే టీఆర్ఎస్ భ్రష్టుపట్టిపోయింది. ఇప్పుడు కనీస విలువలులేని మీ పార్టీకి అడ్డగోలు అధికారం, ఆధిపత్యం, అణిచివేత, అవినీతి  మాత్రమే పునాదులు.
 
ఒకపార్టీలో గెలిచిన వారిని మరోపార్టీలో చేర్చుకుంటే చీరి చింతకు గట్టాలన్న మీ మాటలు మీకు వర్తించవా? ఇతర పార్టీలనుంచి నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన్రు.  ఉద్యమకాలంలో ఏదోవిధంగా ఉద్యమ కారులను అణిచేందుకు ప్రయత్నించిన వారంతా ఇవాళ, బెల్లం చుట్టూ ఈగలు మోగినట్లు, మీచుట్టే చేరిండ్రు. వారందరూ ఇవాళ అకస్మాత్తుగా తెలంగాణా ముద్దు బిడ్డలయిండ్రా? వీళ్లతోనేనా మీరు బంగారు తెలంగాణా సాధించేది.? మీఈ దుశ్చర్యలతో నాడు ఉద్యమంలో పాల్గొని  ఆత్మత్యాగాలు చేసిన బిడ్డల ఆత్మలు క్షోబించవా?
 
ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు పదిలక్షల రూపాయల ఆర్ధికసాయం, ఇంటికో ఉద్యోగం ఇప్పటికి ఎంతమందికి ఇచ్చారో బహిరంగ చర్చకు సిద్దమా? అసలు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల అడ్రసులు మీకు తెలుసా? పోరాడి అసువులు బాసిన బిడ్డలకు కనీస గౌరవం కల్పించి, వారి కుటుంబ సభ్యులను ఆదుకోకపోవడం తమరి కృతజ్ఞత రాహిత్యానికి నిదర్శనం.
 
తెలంగాణా ఏర్పాటయిన తర్వాత ఆత్మహత్యలుండవని, బంగారు తెలంగాణా సాధించుకుందామని మీరు చెప్పిన మాటలు నమ్మి ప్రజలు మీకు పట్టం కట్టిన తర్వాత కూడా ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు. వేలాది  మంది రైతులు ఆత్మహత్యలపాలవుతున్నా మీరూ, మీ భజన సంఘం  ఇదంతా గతపాలకుల వైఫల్యమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుల బాధ నుండి విముక్తి కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా మీరుగాని మీ ఎమ్మెల్యేలు గాని పరామర్శించక పోవడం రాక్షసత్వం కాదా?
 
జబ్బలు చరచుకొని, మీరు అమలు చేశామని చెప్పుకుంటున్న లక్షరూపాయల రుణమాఫీ ఒక బూటకం.  నాలుగు విడతల రుణ మాఫీ తరువాత కూడా, ఇప్పటికి లక్షరూపాయల రుణం తీసుకున్న రైతుపై  ఇంకా దాదాపు 60 వేల రూపాయల వడ్డీ భారం అలాగే ఉంది. 35లక్షల మంది రైతుల పాసుపుస్తకాలు ఇంకా బ్యాంకుల  తాకట్టులో ఉన్నాయి. కొత్తగా బ్యాంకు రుణాలు రాక, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అడ్డికి పావుసేరు అన్నట్లు పెద్ద మొత్తం వడ్డీలు చెల్లిస్తూ , ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేస్తూ మరింత అప్పుల ఊబిలో కురుకుపోతుండ్రు. మీ కనుసైగతో పనిచేసే ప్రభుత్వ అధికారగణం, అంతా మీ చుట్టూ ఉన్నా,  మీరు చిటికేస్తే, రాష్ట్రం లో ఉన్న బ్యాంకులన్ని ఏ రైతుకు ఎంత వడ్డీ అప్పు ఉంది అన్న సమాచారం అందించే వ్యవస్థ ఉంది.  కాని అది విస్మరించి, రైతులను మభ్యపెట్టే చర్యలు చేస్తూ, ప్రతిపక్షాల మీద  వడ్డీ సమాచార సేకరణ భాద్యత నెట్టివేసి చోద్యం చోస్తున్న మీ వైఖరి అభ్యంతరకరం.
 
విద్యుత్ విషయంలో  “ఏ దొడ్లో కదితేంది, మా దొడ్లే ఈనితే చాలు” అన్నట్లుంది మీ వ్యవహారం. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై,  90 శాతం పైగా పూర్తయిన భూపాలపల్లి, జైపూర్, సింగరేణి, పులిచింతల, జూరాల తదితర విద్యుత్ కేంద్రాలను మీరొచ్చిన తర్వాత ప్రారంభోత్సవాలు చేసి ఇదంతా తమరి ఘనతేనని చెప్పుకోవడం హాస్యాస్పదం కాదా? గుండె మీద చేయి వేసుకొని మీరు చెప్పండి, ఒక్క యూనిట్ కొత్త విద్యుత్ ను సైతం మీ హయాంలో ఉత్పత్తి చేయకుండా, మా వల్లనే విద్యుత్ సమస్య తీరింది అని ప్రచారం చేసుకోవడం లో మీరు గోబెల్స్ ని మించి పోయిండ్రు. 2010-11 నాటికి దేశమంతా లోటు కరెంటు తో ఇబ్బంది పడుతుంటే, ఆనాడు  మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో  ఇవాళ దేశమంతా సర్ ప్లస్ కరెంటు ఉత్పత్తి అవుతున్నమాట నిజంకాదా?  ఇక పోతే ఇవాళ రైతులు 24 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వమని కోరట్లేదు, కానీ పండించిన పంటకు మద్దతు ధర, సకాలంలో  ఎరువులు, పురుగులమందులు, కల్తీలేని విత్తనాలందించడం, మార్కెటింగ్ సహాయం, అవసరం మేరకు గొడౌన్స్ కావాలని కోరుకుంటుండ్రు.
 
ఆనాడు సబ్బండ వర్ణాలు, సకలజనులు ఉద్యమంలో లక్షలాదిగా కదిలారు. ఎక్కడ చూసినా జనసంద్రమై సాగరహారాలు, మిలియన్ మార్చులు, దిగ్భంధనాలు చేసినప్పుడు ఇవాళ మీ పంచన చేరి అధికారం చెలాయిస్తున్న తెలంగాణ ఉద్యమ ద్రోహుల ఎవరెక్కడున్నరో కొద్దిగ గుర్తుకుతెచ్చుకోండి.  జేయేసి పిలుపు మేరకు  మిలియన్ మార్చిలో జనమంతా లక్షలాదిగా కదిలి ట్యాంకు బండు పైకోచ్చిన సందర్భంలో కేకే, మధుయాష్కిలాంటి వారు ఆనాడున్న ప్రభుత్వాన్ని దిక్కరిస్తూ మిలియన్ మార్చిలో పాల్గొన్నరు.
 
ఆనాడు సాగరహారానికి పర్మిషన్ దొరక్కపోతే నాటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిగారి చొరవ వల్లే పర్మిషన్ వచ్చింది నిజం కాదా?  పార్లమెంట్ లో  పెప్పర్ స్ప్రే దాడులు జరిపితే కళ్లు పోయినా పర్వాలేదని పోరాడిన పొన్నంప్రభాకర్ తో పాటు సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,అంజన్ యాదవ్, మధు యాష్కీ, బలరాం నాయక్, రాజయ్య, సురేష్ షెట్కార్ లాంటి బలహీన వర్గాల నేతలు ఆంధ్ర ఎంపీల ముష్టిఘాతాల తాకిడికి తట్టుకొని, చావో రేవో అన్నట్లు కొట్లాడి తెలంగాణ బిల్లు సాధిస్తే, కాంగ్రెస్ నాయకులూ ఏం చేసిండ్రని అనడానికి నోరెట్లా వస్తుంది. ఆ సందర్భంలో తమరు పార్లమెంటు దరిదాపుల్లోకూడా రాకుండా ఎక్కడున్నారో ఒక్క సారి గుర్తుకుతెచ్చుకోండి. ప్రజల ఆకాంక్షల మేరకు, కాంగ్రెస్ నేతలు స్వంత పార్టీపై  వత్తిడి తెచ్చినందువల్లే తెలంగాణ సిద్దించింది,  కాని కాంగ్రెస్ నేతలు  ఏం చేయలేదని చెప్పడం మీ ద్వంద వైఖరికి నిదర్శనం.
 
నాడు ఎమ్మెల్యే క్వార్టర్లో , ఇందిరాపార్క్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  సపోర్ట్ తో  తెలంగాణా రావడం ఖాయమంటూ చెప్పిన మాటలేమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి సిగ్నల్ లు ఉన్నాయంటూ చెప్పింది నిజం కాదా? మంత్రి గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేసి దీక్షకు పూనుకుంటే ఆయనను కీర్తించిన తమరు ఎమ్మెల్యేలతో దీక్షా శిబిరంలో నిమ్మరసం తాగించింది నిజంకాదా...?
 
తెలంగాణా ఏర్పాటుకోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఒప్పించడం కోసం మాజీ ఉపముఖ్యమంత్రి దళిత బిడ్డ దామోదర రాజనర్సింహ్మ నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ధిక్కరించి  చేసిన కృషిని మరవడం సమంజసమా? నాటి మంత్రి, నేటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఛైర్మెన్ గా జీవో 610 పై వేసిన హౌస్ కమిటీ లో చేసిన కృషి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీగారితో తనకు ఉన్న చనువుతో తెలంగాణ బిల్లు ముందుకు కదిలించడంలో చేసిన కృషి మీకు గుర్తుకు రాకపోవడం దౌర్భాగ్యంకాదా..?
 
తెలంగాణనేతల, ప్రజల ఆకాంక్షలు గౌరవించి, అన్న మాటకు కట్టుబడి తల్లి సోనియాగాంధీ, ఓ పక్క  పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తెలిసినా నిస్వార్ధంగా,  సాహసోపేత నిర్ణయం తీసుకుని తెలంగాణ ఇచ్చింది నిజంకాదా?
 
స్వార్ధం కోసం చరిత్రను వక్రీకరించడం సామజిక నేరం. నాడు అన్ని పార్టీల నేతలు తెలంగాణా కొసం ఒక్కటయ్యిన్రు , తెలంగాణ కోసం కొట్లాడిన్రు. కాని ఇవాళ అంతా నావల్లే వచ్చిందని, అంతానేనే చేశానంటూ బీరాలు పలుకుతూ చరిత్ర వక్రీకరిస్తూ మిగితావారందరిని , రాజకీయ స్వార్ధం తో సమాజం ముందు దోషులుగా చిత్రీకరించే భావ నియంత్రణ వైఖరి  కుట్రపూరితమైనది.
 
సమైక్యరాగం ఆలపించి, ఉద్యమకారులపై  దాడులు చేయించి, అక్రమ కేసులు పెట్టించిన మంత్రి మహేందర్ రెడ్డి , తుమ్మలనాగేశ్వర్ రావు, మైనంపల్లి హన్మంతరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ అడ్వొకేట్ల తలలు పగలకొట్టిన తీగల కృష్ణారెడ్డి, ఆఖరికి  తమరిని నానాబూతులు తిట్టిన కొండా సురేఖ దంపతులను ఇవాళ మీ పక్కనచేర్చుకుంటే అమరుల ఆత్మలు క్షోబించవా?
 
ఇవాళ మీ అస్తవ్యస్త నిర్ణయాలతో ఉద్యమకారులు తమకు సరైన న్యాయం జరుగడం లేదని ప్రాణత్యాగాలకు పాల్పడుతున్నరు.  మచ్చుకు  కొన్ని దయనీయమైన ఉదంతాలు, మీ దృష్టికి తీసుకు వస్తున్న. కొట్లడి తెచ్చుకున్న తెలంగాణా లో  తమకు న్యాయం జరుగడంలేదని నల్లగొండ జిల్లాభువనగిరిలో జక్కుల యాకస్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ పోరాటంలో ముందు నిలబడి , మిలియన్ మార్చ్ లో పోలీసుల లాఠీ దెబ్బలతో వెన్నముక బాగా దెబ్బతిని ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత  లేక చాలారోజులుగా మంచం పట్టిన యాకస్వామికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన మీ నేతలెవరూ ఆదుకోకపోవడం వల్ల మనస్తాపం చెంది రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.వికారాబాద్ లో అయూబ్ ఖాన్ వంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూపోతే  మీ యొక్క అద్దె అనుచరుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.  సోషియల్ మీడియాలో మీ అక్రమాలను ప్రశ్నించిన పాపానికి నిజామాబాద్ లో ఓ బస్ కండక్టర్ విధుల్లోంచి తొలగించిన ఘనత తమరి ప్రభుత్వంది కాదా..?
 
మనరాష్ట్రం మనకొస్తే.. మనపాలన మనమే చేసుకోవచ్చని, లక్షలఉద్యోగాలు ఆంధ్రావాళ్లు కొల్లగొట్టుతున్నారని కల్లబొల్లి కబుర్లు చెప్పి మభ్యపెట్టిన తమరు ఇవాళ యువత ఉద్యోగాలకేం తొందరోచ్చిందని మాట్లాడడం, ఉద్యమద్రోహులకు పట్టం కట్టడం తమరు చేస్తున్న పచ్చి మోసం, ధగా కాదా? పైగా ఇంతమందికి ప్రభుత్వం ఎలా ఉద్యోగాలు ఇవ్వగలదని ఉల్టా ప్రశ్నించడం న్యాయమా? ఉమ్మడి రాష్ట్రంలో కొంత వరకు అయినా ఉద్యోగాలు కల్పించిండ్రు, కాని స్వరాష్ట్రంలో  ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, నిరుద్యొగులను అవమానించే రీతిలో మాట్లాడడం భాదాకరం.. అమలుకు సాధ్యం కాని  ఎన్నో హామీలనిచ్చి ఏవీ అమలుచేయకుండా కాలం వెళ్లదీస్తూ తల తోక లేకుండా రోజు కో కొత్తపథకాలను పెట్టి,  కోర్టు మొట్టికాయలు తింటూ, కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తూ బతుకీడుస్తున్నరు. ఉద్యోగాలు అడిగిన పాపానికి ఉద్యమాలు చేసిన  విద్యార్ధులను లాఠీలతో కుళ్లబొడిపించిన ఘనత మీది.
 
తెలంగాణా వచ్చిన తర్వాత ప్రజలు ప్రశ్నించే హక్కుకూడా కోల్పోయిండ్రు.  ఒక వేళ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో, ఆనాటి   పాలకులు కిరణ్ కుమార్ రెడ్డి తో సహా, మీడియా పట్ల, ప్రశ్నిచే గొంతుల పట్ల ఈ రోజు మీరు  అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరిని అప్రజాస్వామ్య  విధానాలనే వారు కూడా అమలు చేసుంటే, ఉద్యమ పరిణామం ఎలా ఉండేదో ఒక్క సారి లోతుగా ఆత్మవలోకం చేసుకోండి. పౌరహక్కులను కాలరాస్తూ, ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ, ప్రజాస్వామిక ఆకాంక్షలను తెలిపే ధర్నాచౌక్ లను ఎత్తివేసి, మీ స్వార్ధ రాజకీయాలకోసం  ఇవాళ  కులాల కుంపట్లు రగిల్చి, ఆకుంపటిలో రాజకీయచలికాచుకోవాలని చూస్తున్న మీ నిజస్వరూపాన్ని తెలంగాణా ప్రజలంతా గమనిస్తుండ్రు . సబ్బండకులాల సమాహారం తెలంగాణా, అలాంటి సమాజంలో కులాలు, మతాలవారిగా విభజన చేసి రాజకీయంగా లబ్దిపొందాలని చూడడం తెలంగాణాకు మీరు చేస్తున్న శాశ్వత ద్రోహం .
 
వ్యక్తులు తాత్కాలికం, అధికారం అశాశ్వతం. భవిష్యత్తు తరాల బతుకులు బాగుపడాలంటే వ్యవస్ధలు శాశ్వతంగా పటిష్టంగా ఉండాలి. విలువలతో కూడుకున్న రాజకీయాలు ఉండాలి. కాని అధికారం కోసం వ్యవస్ధలు కూల్చివేయడం తగదు. అశాశ్వతమైన స్వార్ధ రాజకీయం కొసం ప్రజాస్వామ్యాన్ని,  ప్రశ్నంచే గొంతుకలను అణిచివేయడం సబబు కాదు, రాజ్యాంగాన్ని కాల రాయడం ఘోర నేరం. ఇకనైనా  మీ నియంతృత్వధోరణి త్యజించి ధర్మబద్దంగా న్యాయబద్దంగా పరిపాలించాలని విజ్నప్తి.

 

ఇట్లు ..
 

డా. శ్రవణ్ దాసోజు.

loader