భూకబ్జా కేసులో భిక్షమయ్య గౌడ్ కు బిగుస్తున్న ఉచ్చు ఆయన కుటుంబసభ్యలకు సైతం చిక్కలు తప్పేలా లేవు ఫ్యామిలీ మొత్తానికి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న గౌడ్ సర్కారు తీరును ఎండగడతానన్న భిక్షమయ్య గౌడ్
తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ చిక్కుల్లో పడ్డారు. ఒక భూ ఆక్రమణ కేసులో ఆయన పీకల్లోతు కూరుకుపోయారు. ఆయనే కాదు ఆయన ఫ్యామిలీ మొత్తం చిక్కల్లో పడిపోయింది. వారికి పోలీసు అధికారులు ఉచ్చు బిగిస్తున్న వేళ వారికి స్వల్ప, తాత్కాలిక ఉపశమనం దక్కింది. ఆ వివరాలేంటో ఇక్కడ చదవండి.
ఒకవైపు భూ దందాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచి ఆందోళనలు తీవ్రతరం చేస్తోంటే అదే సమయంలో ఆ పార్టీ నేత ఒకరు భూదందాల కేసులో చిక్కుల్లో పడ్డారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తోపాటు భార్య సువర్ణ, కొడుకు ప్రవీణ్ కూడా చిక్కుల్లో పడ్డారు. 2015 సంవత్సరంలో ఫోర్జరీ సంతకాలతో 250 ఎకరాల భూమిని కబ్జా చేసిన కేసులో తాజాగా ముగ్గురు వ్యక్తులను యాదాద్రి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసుతో సంబంధమున్న మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ సహా మరో ఏడుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. బిక్షమయ్య, ఆయన భార్య, కొడుకు ప్రవీణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఫోర్జరీ జరిగిందని నిపుణులు నిర్ధారించడంతో బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేయనున్నట్లు డీసీపీ యాదగిరి తెలిపారు. త్వరలోనే మరో ఇద్దరిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఈ కబ్జా కేసు మాజీ ఎమ్మెల్యే బూడిద రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అన్న చర్చ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ కేసు వ్యవహారం కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారిందన్న చర్చ నడుస్తోంది.
అయితే బూడిద భిక్షమయ్య గౌడ్ మాత్రం ఇందలో ఎలాంటి ఫోర్జరీ లేదని చెబుతున్నారు. అధికార పార్టీ వత్తిళ్లకు లొంగకపోవడంతో ఇలాంటి కేసులను పెట్టి వేధించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తాను ఏ చర్చకైనా సిద్ధమేనని ఆయన అంటున్నారు.
చూడాలి ఈ కేసు ఎటు దారి తీస్తుందో మరి?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
