తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన (KCR Birthday) వేడుకలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపున్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన (KCR Birthday) వేడుకలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపున్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌ అలీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసే సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనను అరెస్ట్ చేయడంతో ఆయన పోలీసులతో అంజన్ కుమార్ యాదవ్ వాగ్వాదానికి దిగారు. పోలీసులు తీరును తీవ్రంగా ఖండించారు. తాము పార్లమెంట్‌లో కోట్లాడి తెలంగాణ తెచ్చామని అన్నారు. కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు.

ఇక, తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కేసీఆర్ జన్మదినం...ప్రతిపక్ష నేతల జైలుదినం కావాలా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల తరపున ప్రశ్నించడమే తాము చేసిన నేరమా అంటూ ప్రశ్నలు సంధించారు. ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. #TelanganaUnemployementDay అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. 

సీఎం కేసీఆర్ ఆయన నీడకు కూడా భయపడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువత ప్రాణాలు వదులుతున్నారని...ఇది సంబరాలు చేసుకునే సమయమా..? అంటూ ప్రశ్నించారు. ఇక, రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌ను ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్.. ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కుతుందని ఆరోపించరాు. కేసీఆర్ తెలంగాణలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.