రాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలో పుడింగ్ మింక్ పబ్ లో జరిపిన దాడుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు ఉన్నాడన్న వార్తల మీద ఆయన తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని రాడిసన్ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అరవింద్ కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ స్పందిస్తూ.. ‘ నా కుమారుడు బర్త్ డే పార్టీ కి వెళ్ళాడు. ఫ్రెండ్స్ తో కలిసి పెడితే అబాండాలు వేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా కుటుంబం అలాంటిది కాదు. దీంట్లో నిజానిజాలు తేల్చాలి. సిటీలో ఉన్న అన్ని పబ్ లను మూసివేయాలి. మద్యపాన నిషేధం విధించాలి’ అని అన్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలో పుడింగ్ మింక్ పబ్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఆదివారం తెల్లవారుజామున ఆ పబ్ మీద జరిగిన దాడిలో పోలీసులు అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం పాటు, బడా బాబుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఆ పబ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి కుమార్తె తేజస్విని చౌదరిదంటూ ప్రచారం జరుగుతోంది. దీని మీద రేణుకా చౌదరి స్పందించారు.
పోలీసులు హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక బార్ మీద దాడులు జరిపారు. అయితే, మీడియాలోని కొన్ని వర్గాలు ఆ పబ్ మా అమ్మాయి తేజస్విని చౌదరిదని పేర్కొన్నాయి. అంతేకాదు, పోలీసులు ఆమెన అరెస్ట్ చేశారని, విచారించారని కూడా ప్రచారం చేస్తున్నాయి. దీంట్లో ఒక్కటి కూడా నిజం కాదు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కు మా అమ్మాయి తేజస్విని యజమాని కాదు. అసలు ఆ పబ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలతో మా అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు.
పైగా, పోలీసులు దాడులు చేసిన ఏప్రిల్ 2వ తేదీన మా అమ్మాయి తేజస్విని ఆ పబ్ లో లేనేలేదు. అలాంటప్పుడు ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం, ప్రశ్నించడం జరగని పని. ఈ సందర్భంగా నేను మీడియా సంస్థలను కోరేదేమిటంటే.. కనీస పాత్రికేయ విలువలు పాటించండి. వార్తలు ప్రసారం చేసేముందు వాస్తవాలు నిర్తారించుకోండి. మీ సంచలనాత్మక కథనాల కోసం ప్రైవేటు వ్యక్తుల పేర్లను బయటికి లాగే ప్రయత్నం చేయొద్దు" అంటూ రేణుకా చౌదరి హితవు పలికారు.
కాగా, ఈ కేసును తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ .. పోలీసు అధికారులతో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఎస్సైలు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. మరోవైపు పబ్‌లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసుకు సంబందించిన సాంకేతిక ఆధారాలపై వెస్ట్ జోన్ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ కేసును నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
