Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్‌‌ సమీక్ష.. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చానన్న ఠాగూర్.. జగ్గారెడ్డికి అందని పిలుపు

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆ పార్టీ హైకమాండ్ (congress high command) శనివారం సమీక్ష చేపట్టింది. ఉదయం దాదాపు గంటన్నర పాటు.. సమీక్ష జరిపారు. సాయంత్రం 6 గంటలకు మరోసారి సమావేశం కానున్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore) తెలిపారు.

congress high command review on huzurabad defeat Manickam Tagore Key Comments
Author
New Delhi, First Published Nov 13, 2021, 1:15 PM IST

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆ పార్టీ హైకమాండ్ (congress high command) శనివారం సమీక్ష చేపట్టింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ (kc venugopal) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore).. హుజురాబాద్ ఓటమిపై సమీక్షించుకుంటున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్, బీజేపీలు కేంద్రంలో దోస్తీ, రాష్ట్రంలో కుస్తీ పడుతున్నాయని ఆరోపించారు. 2023 నాటికి సంస్థాగతంగా బలపడతామని ధీమా వ్యక్తం చేశారు. 

Also read: హుజురాబాద్‌ ఓటమిపై కాంగ్రెస్ హైకమాండ్ సమీక్ష.. హాజరైన ముఖ్య నేతలు..

తొలి రౌండ్ చర్చలు ముగిశాయని.. సాయంత్రం 6 గంటలకు మరోసారి సమావేశం కానున్నట్టుగా చెప్పారు. సాయంత్రం భేటీ తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రతి సీనియర్ నాయకుడు.. వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ సిగ్గు లేకుండా బీజేపీతో బంధం కొనసాగిస్తున్నాడని.. తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ లేదన్నారు.టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. 

వరిని కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ కొనుగోలు చేయాలని.. కానీ ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. 
ఆ పార్టీల మధ్య స్నేహ బంధాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు స్పందించిన మణిక్కం ఠాగూర్.. బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్‌ చేసిందా అనే ప్రశ్నకు తాను సమాధానమిచ్చానని చెప్పారు. 

జగ్గారెడ్డికి అందని పిలుపు.. 
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి (Jagga Reddy) మాత్రం కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రాలేదు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో జగ్గారెడ్డికి పిలుపు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. జగ్గారెడ్డి ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. 

అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో బల్మూర్‌ వెంకట్‌ని రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క బలి పశువును చేశారని ఆరోపించారు. డిపాజిట్‌ వస్తే రేవంత్‌ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై పూర్తి స్థాయిలో సమీక్ష చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పీఏసీ సమావేశంలో కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీలో జరుగుతున్న సమీక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

ఇక, ఢిల్లీలో జరుగుతన్న సమీక్ష సమావేశానికి టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్,  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), సీఎల్పీ నేత  మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేతలు వి హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు. హుజురాబాద్‌లో ఓటమికి సంబంధించి పార్టీ నేతల నుంచి కేసీ వేణుగోపాల్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. 2018 ఎన్నికలతో పోల్చితే ఓటు బ్యాంకు దారుణంగా పడిపోవడానికి గల కారణాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios