ఆ ప్రచారంతో అలర్ట్... టికెట్ ఆశావాహులకు కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ..!
తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలతో కొత్త జోష్ నెలకొంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో చేరికలతో.. ఇప్పటికే అక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నవారి పరిస్థితి ఏమిటనేది చర్చనీయాశంగా మారుతుంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలతో కొత్త జోష్ నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణలో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో చేరికలతో.. ఇప్పటికే అక్కడ చాలా కాలంగా పనిచేస్తున్న వారి పరిస్థితి ఏమిటనేది చర్చనీయాశంగా మారుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఒకటి కంటే ఎక్కువ మంది నేతలు టికెట్లపై ఆశలు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌కు జోష్ పెరుగుతుండటంతో మరికొందరు నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్దపడుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ కోసం తెరవెనక ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుతుందనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో కొనసాగుతూనే ఉంది.
కాంగ్రెస్ సీటు తనకే అంటూ తీన్మార్ మల్లన్న కొంత కాలంగా ప్రమోట్ చేసుకుంటున్న అంశం చర్చగా మారింది. సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న తానే కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే కొంతకాలం క్రితం తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరగా.. ప్రస్తుతం ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే, మేడ్చల్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మంచి పట్టున్న నేతగా పేరున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) బరిలో దింపేందుకు కాంగ్రెస్ సిద్దం అవుతుందనే ప్రచారం సాగుతుంది. ఇక, మేడ్చల్ నియోజకవర్గంలో జంగయ్య యాదవ్, హరి వర్ధన్ రెడ్డి పార్టీ కోసం పని చేస్తున్నారు. అయితే ఆకస్మాత్తుగా తీన్మార్ మల్లన్న తానే అభ్యర్ధి అని ప్రచారం చేసుకోవటంతో ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ పరిణామాలు కొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎవరికి వారు టికెట్లు తమకే అంటూ ప్రచారం చేసుకోవటం సరికాదని కాంగ్రెస్ అధిష్టనం స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. టికెట్ల ఖరారు నిర్ణయం పూర్తిగా తామే పర్యవేక్షిస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం.
మరోవైపు ప్రియాంక గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టారని.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడూ నివేదికలు తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. చేరికల సందర్భంగా నేతలకు ఇచ్చే హామీలు.. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడే వారిని పరిగణలోకి తీసుకోవాలని ప్రియాంక గాంధీ భావిస్తున్నారు. సర్వేలు, ఇతర నివేదికల ఆధారంగా గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వడంతో.. పార్టీ జెండా భుజాన వేసి మోసిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయంతో కాంగ్రెస్ అధిష్టానం ఉందని చెబుతున్నారు. దీని ఆధారంగానే సీట్ల సర్దుబాటు ఉంటుందని రాష్ట్ర సీనియర్ నాయకులు హైకమాండ్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.