Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం తమ్ముడు .. నాటు నాటు డ్యాన్సులేస్తున్నారు : ప్రియాంకా గాంధీ సెటైర్లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.   ప్రధాని మోడీ విధానాలను కేసీఆర్ ఎప్పుడూ వ్యతిరేకించరని.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి నాటు నాటు డ్యాన్స్ వేస్తున్నారని ప్రియాంకా సెటైర్లు వేశారు. 

congress general secretary priyanka gandhi vadra satires on brs bjp and aimim ksp
Author
First Published Nov 19, 2023, 3:17 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్‌లో జరిగిన విజయభేరి సభలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. పరీక్ష తేదీలు, ఫలితాల ప్రకటన తేదీలు జాబ్ క్యాలెండర్‌లో వుంటాయని ప్రియాంకా గాంధీ చెప్పారు. ఆసిఫాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ యువతకు 2 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ధరణి ద్వారా రైతులను , ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తుందని ప్రియాంకా దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు అప్పులు పాలవుతున్నారని ప్రియాంకా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్ధతు ధర ఇస్తామని.. ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్ విధానమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం, ఢిల్లీ లిక్కర్ స్కాంపై మోడీ మాట్లాడరని .. కేవలం కాంగ్రెస్ నేతలపైనే ఈడీ, సీబీఐని పంపిస్తారని ఆమె దుయ్యబట్టారు. రెండు సార్లు నమ్మి బీఆర్ఎస్‌కు ఓటు వేసి 10 ఏళ్లు వెనక్కిపోయారని .. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా వున్నారని ప్రియాంక చెప్పారు. 

ప్రజలకు జవాబుదారిగా వున్న నేతలను ఎన్నుకోవాలని .. ఆత్మపరిశీలన చేసుకుని ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని.. జల్ , జంగల్, జమీన్‌పై ఆదివాసులకు హక్కు వుంటుందని ఇందిర భావించేవారని ప్రియాంకా గాంధీ తెలిపారు. మీ భూములపై హక్కులను ఇందిరాగాంధీ కల్పించారని ఆమె గుర్తుచేశారు. బీఆర్ఎస్‌‌పై పెట్టుకున్న ఆశలు ఒక్కటీ నెరవేరలేదని.. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ప్రధాని మోడీ విధానాలను కేసీఆర్ ఎప్పుడూ వ్యతిరేకించరని.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి నాటు నాటు డ్యాన్స్ వేస్తున్నారని ప్రియాంకా సెటైర్లు వేశారు. 

వాళ్ల డ్యాన్సులు చూడండి.. కానీ ఓటు వేయొద్దని ఆమె పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని.. పదేళ్లలో తెలంగాణ పురోగతి సాధించిందా లేదా ఆలోచించాలని ప్రియాంకా గాంధీ కోరారు. తెలంగాణలో పదేళ్లలో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ స్కాములేనని .. బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం తమ్ముడు ఉన్నాడని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసిందని చెబుతున్న మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రియాంకా ప్రశ్నించారు. ప్రధాని మోడీ సీబీఐ, ఈడీని కాంగ్రెస్ నేతలపైనే ప్రయోగిస్తున్నారని.. తెలంగాణలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలా.. వద్దా అని ఆమె కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ప్రియాంకా గాంధీ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios