తెలంగాణ సిఎం కేసిఆర్ కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు దాసోజు. ఆయన రాసిన బహిరంగ లేఖను యదాతదంగా ప్రచురిస్తున్నాం. చదవండి.

 

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  గారికి

విషయము : వలస కార్మికులు మరియు ఎన్నారైల కోసం సమగ్ర విధి విధానాలతో కూడుకున్న ప్రత్యేక చట్టాన్ని అసెంబ్లీ ద్వారా చేసి ప్రకటించాలని మరియు కువైట్ దేశానికి వెంటనే ప్రత్యేక ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపాలని డిమాండ్..

అయ్యా,

తెలంగాణా రాష్ట్రంలో సామాజిక, ఆర్ధిక పరిస్థితి అతి  దారుణంగా దెబ్బతిని, తెలంగాణ బతుకు చిత్రం చిధ్రం కాగా, తదనంతర  పరిణామాల వల్ల గ్రామీణ ప్రాంతాల యువకులు బతుకు దెరువు కోసం, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస పోవాల్సిన అగత్యం ఏర్పడ్డ విషయం మీకు తెలిసిందే.

తెలంగాణా రాష్ట్రంలో ఆదిలాబాద్ , నిజామాబాద్, కరీంనగర్, మెదక్ మరియు హైదరాబాద్ జిల్లాలకు చెందిన దళిత, వెనుకబడ్డ తరగతుల కులాలకు చెందిన యువత మరియు ముస్లీం మైనార్టీలు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస పోతున్నరు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వివరాల ప్రకారమే... దాదాపు 10నుంచి 12లక్షల మంది గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీ సి సి) దేశాలకు తెలంగాణ నుంచే వలస పోతున్నరని స్ఫష్టమవుతోంది. వీరిలో మహిళలు కూడా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తెలంగాణ నుంచి వలస పోతున్న కార్మికుల ద్వారా ప్రతి నెల దాదాపు 1500 కోట్ల  విదేశీమారకం తెలంగాణా రాష్ట్రానికి  వస్తోంది. తెలంగాణా వలస కార్మికుల ద్వారా ఇంత భారీ మొత్తంలో మన రాష్ట్రానికి ఆదాయం వస్తోంటే తిరిగి ఆ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా మీరేం చేస్తున్నరో ఒక్క సారి ఆత్మపరిశీలన చేసుకోండి.

తెలంగాణా రాష్ట్రం సాకారమయిన తర్వాత కూడా గతంలో కంటే ఎక్కువ మంది కార్మికులు వలసబాట పడుతున్నరు. చిత్తశుద్ధి లేని టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో వలస కార్మికుల కుటుంబాలు ఎప్పటిలాగే అష్టకష్టాలు పడుతుంటే ఏమాత్రం దయలేని మీ ప్రభుత్వం వలస కార్మికుల పట్ల , వారి కుటుంబాల పట్ల నిర్ధిష్ట మైన విధి విధానాలు తయారు చేయకుండా కుంటి సాకులు చెబుతూ, కాలం వెళ్లదీస్తోంది. 

గల్ఫ్ లో ఎంతో మంది కార్మికులు తీవ్రమైన అష్టకష్టాలు పడుతూ బతుకు భారంగా గడుపుతున్నారు.  వారిపట్ల అక్కడి యాజమాన్యాలు అమానవీయంగా, నీచంగా ప్రవర్తిస్తున్నాయి. గల్ఫ్ కార్మికులకు కనీస మానవ హక్కులు లేవు. ఎంతో మంది కార్మికులు అక్కడి బాధలు తట్టుకోలేక, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడక, కన్న కలలు నెరవేరక మనోవేదనతో ఆత్మహత్యల బాట పడుతున్నరు.

గల్ఫ్ కు వెళుతున్న కార్మికుల్లో చాలామందికి సరైన శిక్షణ, నైపుణ్యం ఉండడంలేదు. ఇక్కడ తగిన ఉపాధి దొరకక, అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు  వెళ్లినవారే ఎక్కువమంది ఉన్నారు. మహిళలు కూడా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్నరు.. వారు పనిచేసే చోట తీవ్రమైన లైంగిక వేధింపులు  ఎదుర్కొంటూ బాధలు పడుతున్నరు. గల్ఫ్ దేశాల్లోని యాజమానుల విపరీత ధోరణులతో విసిగిపోయి తిరిగి స్వదేశం రావాలని కోరుకుంటున్నా తెలంగాణా ప్రభుత్వం పునరావాసం, మరియు ఉపాధి అవకాశాలు కల్పించక పోవడంతో, వారు రాలేక పోతున్నరు.

ఇటీవలే ఓ ఎన్జీవో నిర్వహించిన సర్వే లో  గల్ఫ్ దేశాలలో ఏటా వేలాది మంది కార్మికులు అనారోగ్య సమస్యలతో జబ్బుపడి, ఇతర ప్రమాదాల్లో చనిపోతున్నారని తేల్చింది. 2014 లో.... 5897 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. 2015 లో....5866 మంది.., 2016 లో... 5000 మందికి పైగా చనిపోయారని ఎన్జీవో నిర్వహించిన సర్వే రిపోర్ట్ చెబుతోంది. దాదాపు 200 మందికి పైగా తెలంగాణ ప్రాంతపు కార్మికులు ప్రతి ఏడాది చనిపోతున్నా, దురదృష్టవశాత్తూ తెలంగాణా ప్రభుత్వం ఏఒక్క కార్మికుడి కుటుంబానికి తగినంతగా ఎక్స్ గ్రేషియా  ఇవ్వకపోవడం దారుణం.

గల్ఫ్ ఏజెంట్ల  స్వార్ధపూరిత చర్యల వల్ల ఎలాంటి నైపుణ్యాలు లేకున్నా మంచి ఉద్యోగం వస్తుందని ఆశపడి  గల్ఫ్ బాట పడుతున్న వారే ఎక్కువమంది ఉంటున్నారు. గల్ఫ్ దేశాల్లో కార్మిక సంక్షేమ చట్టాలు లేకపోవడం, అక్కడ విపరీతమైన పనిగంటలు.. అనారోగ్యకరమైన వాతావరణంలో కార్మికులు ఉండాల్సిరావడం, భాషాపరమైన సమస్యలు తలెత్తడం కార్మికులకు ఆశనిపాతంగా మారింది. గల్ఫ్ దేశాలతో  భారత ఎంబసీ  సత్సంబంధాలు కలిగిలేకపోవడం న్యాయపరమైన సహకారం అందకపోవడం, కార్మికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

పేద కార్మికులు చెముడోడ్చి, కష్టించి సంపాదించుకున్న డబ్బుతో ఏర్పాటుచేసిన  బతుకమ్మ, దసరా పండుగ సంబురాలలో పాల్గొనేందుకు గల్ఫ్ దేశాల్లో పర్యటనలు చేస్తూ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు గడిచిన నాలుగు ఏళ్లుగా కేవలం అధికార దర్పాన్ని ఆడంబరంగా  ప్రదర్శిచడం మినహ, ఏనాడూ వారి అభ్యున్నతిని పట్టించుకున్న పాపాన పోలేదు.

మీరు 2014 ఎన్నికల సందర్భంలో, ఓట్లకోసం ఇచ్చిన హామీలు, మీ పార్టీ మానిఫెస్టోలో పొందుపరిచిన  అంశాలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. గల్ఫ్ కార్మికులకోసం 500 కోట్లరూపాయల నిధి, అలాగే చనిపోయిన కార్మికులకు ఎక్స్ గ్రేషియా ,అనారోగ్యంతో తిరిగొచ్చిన కార్మికులకు తగిన పునరావాసం, మరియు ఉపాధి , వలస కార్మికులకు తగిన సామాజిక భద్రత,  సరికొత్త  ఎన్నారై పాలసీ రూపొందిస్తామని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుని నాలుగు సంవత్సరాలు కాలయాపన పాటు చేయడం మోసం దగా కాదా?

వారి కుటుంబసభ్యులు సైతం ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని ప్రేరేపించిన్రు. అంతటి త్యాగ మూర్తులయిన కార్మికులను తెలంగాణా రాష్ట్రం  ఆదుకోక పోవడం సామాజిక నేరం కాదా? టీఆర్ ఎస్ ప్రభుత్వం కార్మికుల భావోద్వేగాలను, వారి భాదలను  మరిచిపోవడం చాలా దారుణమైన, దురదృష్టకరమైన చర్యగా మేం భావిస్తున్నాం. ఇక్కడ ఉన్న వారి  భర్తలు లేదా తండ్రులు లేదా పిల్లలు గల్ఫ్ లో పనిచేస్తున్నరన్న నెపంతో  వారి కుటుంబాలకు  ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సరుకులు సైతం  ఇవ్వడంలేదు. రేషన్ కార్డులను రద్దు చేసి వారి కుటుంబాలను తెలంగాణా ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురిచేయడం దారుణం.

మనమంతా వలసల్లేని తెలంగాణా ఏర్పాటు కావాలని కలలు కన్నాం...వలస వెళ్లిన కార్మికులంతా తిరిగి స్వదేశం రావాలని  కోరుకున్నం.. తెలంగాణా రాష్ట్రంలో వారంతా సగర్వంగా తలెత్తుకుని బతకాలనుకున్నం. కాని ..ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ విఫల పాలనలో  అదంతా కలగానే మిగిలింది. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో, నైపుణ్యాలు పెంచడంలో, పూర్తిగా విఫలమయింది. పర్యవసానంగా యధావిధిగా వలసలు కొనసాగుతూనే  ఉన్నాయి.

మీకు రాజభవనాలు, సౌధాలు నిర్మించుకునేందుకు, అప్పనంగా కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు తగినన్ని నిధులు అందుబాటులో ఉంటాయి గాని, గల్ఫ్ కార్మికుల సమస్యకోసం ఎందుకు నిధులు ఉండడంలేదో  చెప్పండి. 40 లక్షల పైచిలుకు ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే అతిముఖ్యమైన పాలసీ విషయంలో ఎందుకు  తాత్సారం చేస్తున్నరో అర్దం కావడంలేదు. ఎంతో మంది భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే ఒక మహాత్తర సమగ్రపాలసీ తీసుకు వచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడుపుతున్నరంటే ఆశ్చర్యం కలుగుతోంది.

ముఖ్యంగా, జనవరి 29 వ తేదీ నుండి ఫిబ్రవరి 22 తేదీ వరకు, కువైట్ దేశ ప్రభుత్వం భారతీయ కార్మికుల కోసం జనరల్ ఎమ్నేస్టీ ప్రకటించింది. దీని ద్వారా, కువైట్ లో వీసా గడువు ముగిసిన తరువాత అక్కడనే ఉన్న కార్మికులు కానీ, ఏజెంట్ల ద్వారా మోస పోయి ఆ దేశంలో  ఇరుక్కు పోయిన కార్మికులు కానీ తిరిగి రావడానికి వెసులుబాటు కలిగింది. ఈ సందర్భంలో తమ వంతు బాధ్యతగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే ప్రత్యేక అధికార బృందాన్ని, సంబంధిత మంత్రిని కువైట్ కు పంపించాలని, కువైట్ అధికారులతో సంప్రదింపులు జరిపి, కార్మికులకు అండగా ఉంది, కువైట్ నుండి   తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న కార్మికులకు విమాన , టిక్కెట్టు ఖర్చులు ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి. అదే విధంగా, కువైట్ నుండి వచ్చిన కార్మికులకు, పునరావాస సౌకర్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు గల్ఫ్ దేశాలలో పర్యటించినప్పుడు, అనేక మంది వలస కార్మికులు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు.  తీవ్రమవుతున్న గల్ఫ్ భాధితుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కింది అంశాలను  వెంటనే అమలు పరుచాలని డిమాండ్ చేస్తున్నం.

 

1. ఎన్నారై, మరియు గల్ఫ్ కార్మికుల  వెల్ఫేర్ కోసం ప్రత్యేక చట్టాన్ని అసెంబ్లీ ద్వారా చేసి, దానికోసం  రూ. 1000.00 కోట్లతో బడ్జెట్  రూపోందిందిచాలి. ఇందుకోసం ప్రత్యేకంగా , ప్రభుత్వ శాఖతో పాటు ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలి.

2. గల్ఫ్ కు పోతున్న కార్మికులకు ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహకారం లేదా బ్యాంకురుణాలు మంజూరు చేయించాలి. అదేవిధంగా తిరిగి వస్తున్నవారికి ఉద్యోగ ఉపాధి , పునరావాస కార్యక్రమాలు చేపట్టాలి.

3. కార్మికులను గల్ఫ్ దేశాలకు పంపించే సమయంలో దళారులు, బ్రోకర్లు అక్రమాలకు పాల్పడకుండా     నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కఠినమైన ప్రత్యేక చట్టాలు తేవాలి.

4. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేందుకు రూ. 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. ప్రజాపంపిణీ వ్యవస్ద అందించే రేషన్ కార్డులు అందజేయాలి. వారి పిల్లలకు మెరుగైన విద్య. వితంతువులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కుటుంబానికో ఇల్లు ఇవ్వాలి.

5. వలస వెళ్లిన కార్మికులకు సమగ్ర సామాజిక భద్రత కల్పించాలి... లైఫ్ఇన్సూరెన్స్, ప్రమాదభీమా, ఆరోగ్యభీమా కల్పించాలి.

6. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే ప్రతి కార్మికుడికి తప్పనిసరిగా సాంకేతిక శిక్షణ కల్పించాలి తగిన మెళుకువలను నేర్పించేందుకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

7. గల్ఫ్ బాషా సంస్కృతిలపై అవగాహాన కల్పించి ముఖ్యంగా అరబిక్ మరియు అంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించే విధంగా తగిన తర్ఫీదునివ్వాలి.

8. గల్ఫ్ దేశాల్లోని చట్టాలు, న్యాయవ్యవస్ధ మరియు వారి విధివిధానాలు తెలియ జెప్పే ప్రత్యేక  శిక్షణా తరగతులు నిర్వహించాలి.

9. గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయసహాయం అందించాలి.

10. తెలుగు,మరియు ఉర్ధూ , హిందీ మాట్లాడే వారిని గల్ఫ్ దేశాలలో ఉన్న ఇండియన్ ఎంబసీలో నియమించేలా భారత ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి.

11. తెలంగాణా ప్రభుత్వమే గల్ఫ్ దేశాలలో నివాసముండే ప్రత్యేకమైన శాఖను ఏర్పరిచి  అక్కడి కార్మికులు నేరుగా వారితో  సంప్రదించి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం కల్పించాలి.

12. ఒక ప్రత్యేక మైన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేసి  తద్వారా కార్మికుల సమస్యల పై తక్షణమే స్పందించి, పరిష్కరించాలి.

13. గల్ఫ్ వెళ్లే ప్రతి కార్మికుల  వివరాలు నమోదు చేసి వారి బాగోగులు నిరంతరం పరిశీలించాలి.

14. గల్ఫ్ దేశాలతో  దౌత్య సంబంధాలు నిరంతరం నెలకొల్పి  మన తెలంగాణా బిడ్డల రక్షణ, బాగోగుల విషయంలో సరైన చర్యలు తీసుకునేలా ప్రభావితం చేయాలి.

15. ఎన్నారై ల ద్వారా నిర్వహిస్తున్న స్వచ్చంద సేవాసంస్ధలను  కలుపుకొని గల్ప్ దేశాలో కార్మికుల సమస్యలు పరిష్కరించేలా  వారిని ప్రోత్సహించాలి.

 

ఇట్లు

డా. శ్రవణ్ దాసోజు

ముఖ్యఅధికార ప్రతినిధి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.