ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆయనకు రెండు చోట్ల ఓటు హక్కు వుందని తన ఫిర్యాదులో పేర్కొంది
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అసదుద్దీన్‌కు రాజేంద్రనగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో రెండు చోట్ల ఓటు హక్కు వుందని దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ ఈసీని కోరింది.
అంతకుముందు అసదుద్దీన్ మాట్లాడుతూ.. బీజేపీ , కాంగ్రెస్‌లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. ఎంఐఎం విజ్ఞప్తి మేరకు తెలంగాణలో పేదలు నివసిస్తున్న ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లొని హల్ద్వానీలో ఏడు రోజుల్లో 50 వేల మందిని నిర్వాసితులుగా మార్చేందుకు అక్కడి ప్రభుత్వం యత్నించిందని ఒవైసీ దుయ్యబట్టారు. దీనిని సుప్రీంకోర్ట్ అడ్డుకుందన్నారు.
Also Read: 'డీమోనిటైజేషన్ డే' ను జరుపుకోవాలి.. బీజేపీకి ఒవైసీ సవాల్
ఇకపోతే.. ఇటీవల నోట్ల రద్దును సమర్ధిస్తూ సుప్రీంకోర్ట్ తీర్పు వెలువరించడంపై అసదుద్దీన్ స్పందించారు. తీర్పు తర్వాత.. 'డిమోనిటైజేషన్ డే' జరుపుకోవాలని ఒవైసీ మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నోట్ల రద్దు వల్ల 50 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఒవైసీ మండిపడ్డారు. అంతే కాదు జీడీపీ పతనం వెనుక డీమోనిటైజేషన్ హస్తం ఉందని, 2016-17లో 8.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు 2019-20లో 4 శాతానికి తగ్గిందని అన్నారు. డీమోనిటైజేషన్ ఇంత పెద్ద సక్సెస్ అయితే.. బీజేపీ ఎందుకు డిమోనిటైజేషన్ డే జరుపుకోవడం లేదని ఒవైసీ అన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు అప్పులు చేశారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పేదలు మరింత పేదలుగా మారారని విమర్శలు గుప్పించారు.
ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ, “మహిళలు, రోజువారీ కూలీ కార్మికులు, చేతివృత్తులవారు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు పెద్ద నోట్ల రద్దు వల్ల నష్టపోయారని ప్రధానికి తెలుసు. బీజేపీ 'నోటుబండి దివస్' ఎందుకు జరుపుకోదు?" 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని పలు నివేదికలు పేర్కొన్నాయని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత పేదలు పెద్ద మొత్తంలో రుణాల బారిన పడ్డారనీ, ప్రధాని ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ఆయన అసమర్థతను తెలియజేస్తోందని విమర్శించారు. అప్పట్లో రూ.17.97 లక్షలుగా ఉన్న కరెన్సీ నేడు రూ.32.18 లక్షల కోట్ల చలామణిలో ఉందని ఒవైసీ ఆరోపించారు.
