చేతకాని చెన్నమనేని తీరుతో వేములవాడ వెనుకబడిపోతోందన్నారు సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ . చెన్నమనేని రమేశ్‌పై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. 10 నెలల్లో తాము ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేతకాని చెన్నమనేని తీరుతో వేములవాడ వెనుకబడిపోతోందన్నారు. 500 కోట్లతో రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారని.. ముంపు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామన్న హామీని గాలికొదిలేశారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తాగునీటికి కటకట వున్నా దానిపై దృష్టి పెట్టడం లేన్నారు. బాలికలకు జూనియర్ కాలేజ్ లేదని, డిగ్రీ కాలేజ్ లేదని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు.
కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగడం లేదని.. 2018లో దసరాకు నీళ్లు ఇస్తామన్న మంత్రి హరీశ్ రావు ఐదు దసరాలు గడిచినా హామీ నెరవేర్చడం లేదని ఎద్దేవా చేశారు. అటవీ అనుమతులు లేక రోడ్డు పనులు నిలిచిపోయాయని, వేములవాడలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాంపల్లి గుట్ట ప్రాంతంలో పేదలకు పంచిన భూములను ధరణి పేరుతో ప్రభుత్వం లాక్కుందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 10 నెలల్లో తాము ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని.. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన హాత్ సే హాత్ జోడో యాత్ర ఆదివారం ఆయన వేములవాడ నియోజకవర్గ పరిధిలో కొనసాగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కలికోట సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి పేజ్ 2 స్టేజ్ 1ను 2005లో 1750 కోట్లతో వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారని గుర్తుచేశారు. ఇంతమంచి ప్రాజెక్ట్ ను తీసుకొచ్చిన ఆది శ్రీనివాస్ ను ఆనాడు చెన్నమనేని రాజేశ్వరరావు అభినందించారని రేవంత్ తెలిపారు. 2018లో టీఆరెస్ ఓడిపోతుందని హరీష్ రావు కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారని ఆయన దుయ్యబట్టారు. సాగు, తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారని రేవంత్ చురకలంటించారు.
ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని.. కాంగ్రెస్ నిరసనలు, పాదయాత్రలు,రాస్తారోకోలు చేసిందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ప్రశ్నిస్తే వరదకాలువ ద్వారా నీళ్లు ఇస్తామని చెబుతున్నారని.. ఎతైన ఈ ప్రాంతానికి వరదకాలువ ద్వారా నీళ్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అపర భగీరథుడు, ఇంజనీర్ కేసీఆర్ కు ఆ మాత్రం తెలియదా అంటూ సెటైర్లు వేశారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయని కేసీఆర్ పదే పదే ప్రశ్నించారని.. ఉమ్మడి పాలనలో సీమాంధ్రులు వివక్ష చూపినట్లే.. తెలంగాణలో కేసీఆర్ కూడా అదే వివక్ష చూపుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
