తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే తమ వ్యుహాలను అమలు చేయడంతో పాటుగా.. పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ముందుగానే ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే తమ వ్యుహాలను అమలు చేయడంతో పాటుగా.. పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ముందుగానే ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేయటం వలన ప్రతీ సారి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు ఎన్నికలకు కొన్ని నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతూ వచ్చారు. దీంతో ఈ సారి ఎన్నికలకు ముందుగానే క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే నెలలోనే టికెట్లు ఖరారు చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చలు జరుపుతుంది. వివిధ నియోజవర్గాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో అభిప్రాయాలను తెలుసుకుంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీఎల్సీ నేత మల్లు భట్టివిక్రమార్క కూడా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. పీపుల్స్ మార్చ్ పేరుతో మల్లు భట్టి విక్రమార్క్.. 1360 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజకవర్గాల మీదుగా సాగింది.
ఈ క్రమంలోనే భట్టి పాదయాత్ర సాగిన మార్గంలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం వివరాలను కోరినట్టుగా తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలపై ఆయనకున్న అవగాహనను అడిగింది. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ అనంతరం.. రాహుల్ గాంధీతో పాటే భట్టి విక్రమార్క విజయవాడకు వెళ్లారు. ఈ సమయంలో రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిపై రాహుల్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.
అయితే టీ కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి సేకరిస్తున్న వివరాలను క్రోడికరించిన అనంతరం సమస్యలు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ రానున్న రెండు నెలల్లోపే ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది.. పోటీ ఉన్న నియోజకవర్గాల్లోనూ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క ఇచ్చే ఇన్‌పుట్స్ కూడా అభ్యర్థులు ఎంపికలో కీలకం కానున్నట్టుగా తెలుస్తోంది.
