సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్.. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీల బహిరంగ సభలు
ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్, బీజేపీ హైదరాబాద్ వేదికగా రాజకీయ వేడిని పెంచనున్నాయి. ఈ రోజు రెండు పార్టీలు భారీ సభలను ప్లాన్ చేశాయి. కాంగ్రెస్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్రణాళికలు వేయగా.. బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సభ నిర్వహించాలని అనుకుంటున్నది.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు సెప్టెంబర్ 17వ తేదీన వేడెక్కనున్నాయి. రెండు జాతీయ పార్టీలు హైదరాబాద్‌లో పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహించనున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు సభల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ పెద్ద ఎత్తున సభలు నిర్వహించడానికి ప్రణాళికలు వేసుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎంపికైన సభ్యులతో కూడిన సీడబ్ల్యూసీ సమావేశాలను తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించడానికి ప్లాన్ వేసింది. ఆ తర్వాతి రోజు సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీల నేతలతోనూ సమావేశం నిర్వహించనుంది. అదే రోజు హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ వేసినట్టు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17వ తేదీ చాలా ముఖ్యమైనది. ఇండియన్ యూనియన్‌లో తెలంగాణ కలిసిన రోజు ఇదే. ఈ రోజు చుట్టూ పార్టీలు అనేక రాజకీయాలు చేస్తుంటాయి. విలీన, విమోచన, విద్రోహ దినాలుగా ఈ తేదీ చుట్టూ పలు విధాల చర్చ ఉన్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీ పార్టీల సభలకు ప్రాధాన్యత ఉన్నది.
Also Read: బెడ్ పై నుంచి కిందపడ్డ 160 కిలోల మహిళ.. విపత్తు నిర్వహణ సిబ్బందికి కుటుంబం కాల్
తుక్కుగూడలో సుమారు పది లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తామని కాంగ్రెస్ ఇది వరకే ప్రకటించింది. ఇదే రోజున కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు హామీలను కూడా ప్రకటించనుంది. దీనికితోడు ఈ భారీ సభలో సోనియా గాంధీ పాల్గొంటుడటం విశేషంగా ఉన్నది.
కమలం పార్టీ నేతలు కూడా పరేడ్ గ్రౌండ్‌లో వీలైన మేరకు భారీగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్టుగానే ఈ సారి కూడా నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు నెలకు కనీసం ఒక్కసారైనా తెలంగాణకు వస్తానని హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి ఇది వరకే తెలిపిన సంగతి తెలిసిందే.