తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్‌ను కొత్త టెన్షన్ వెంటాడుతుంది. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య గతకొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది.

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్‌ను కొత్త టెన్షన్ వెంటాడుతుంది. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య గతకొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. సిట్టింగ్‌లపై ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు పలు రకాలు ఆరోపణలకు దిగుతున్నారు. దాదాపు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు ఒకరికి మించి నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు. చాలాకాలంగా సొంత పార్టీకే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరుతో విభేదించి.. సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురు నేతలు ఇప్పుడు వాటిని మరింత ఉధృతం చేశారు. 

అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ అధిష్టానంపై విధేయతను ప్రకటిస్తూనే తమకు ప్రత్యర్థులుగా ఉన్న సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీలో చేరినవారికి టికెట్ పొందడంపై చాలా కాలంగా పార్టీల్లో ఉన్న పలువురు సీనియర్లు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పార్టీ టికెట్ ఆశించి పార్టీలో చేరిన వారు అసంతృప్తుల జాబితాలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఒకరికి మించి నాయకులు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. 

ఇందుకోసం తెరవెనక ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు సిట్టింగ్‌గా ఉన్న సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యేను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగా తమకు అధిష్టానం టికెట్లు కేటాయించవచ్చనే ఆశతో ఉన్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతున్న నాయకత్వ పోరుపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించకపోవడంతో.. సమస్యలు మరింత పెద్దదిగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నేతలు పార్టీ లైన్ దాటి మరి విమర్శలకు దిగుతున్నారు. ప్రత్యర్థి పార్టీల సంగతి అలా ఉంటే.. సొంత పార్టీ నేతలపైనే దుమ్మెత్తిపోస్తున్నారు. 

పాలేరు, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖానాపూర్, వరంగల్‌ పశ్చిమ, కల్వకుర్తి, జహీరాబాద్, శేరిలింగంపల్లి, జనగామ, నాగర్జున సాగర్, పినపాక, తాండూరు, కొత్తగూడెం, ఉప్పల్, హుజూరాబాద్, రాజేంద్రనగర్, మహబూబాబాద్‌లతో పాటు దాదాపు 40కి పైగా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఎక్కడికక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. నియోజకవర్గంలోని నేతలు వేర్వురు వర్గాలుగా రాజకీయం చేయడం ప్రత్యర్థి పార్టీలకు మేలు చేస్తుందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అయితే అందరూ పార్టీ విధేయులను.. ఎన్నికల నాటికి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసం అందరూ కలిసి పనిచేస్తారని బీఆర్ఎస్ వర్గాలు ధీమాతో ఉన్నాయి. తాజాగా రాజయ్య, కడియం శ్రీహరిల పరస్పర ఆరోపణలు తీవ్ర రూపం దాల్చడంతో.. రాజయ్యను పిలిపించి మాట్లాడిన కేటీఆర్ పలు హెచ్చరికలు జారీ చేశాడని ఆ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్‌లోని ఆధిపత్య పోరుకు చెక్ పడే అవకాశం ఉందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ దక్కని బలమైన నేతలను వారి పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రత్యర్థి పార్టీలు వేచిచూస్తున్నాయి. మరి ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌లోని నేతల అసంతృప్తులు ఏ రూట్ తీసుకుంటుందో తేలనుంది.