Central Election Commission: తెలంగాణలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘ బృందం పర్యటించనుంది.  అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతపై ఎన్నికల సంఘం ప్రతినిధులు సమీక్ష నిర్వహించనున్నారు.

Central Election Commission: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజ్ కుమార్ సారధిలోని 17 మంది అధికారుల బృందం హైదరాబాద్ లో రాష్ట్రంలో పలు పార్టీల నేతలతో, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో విడివిడిగా సమావేశమై చర్చించింది. తొలుత ఎన్నికల కమిషన్ బృందం ఇవాళ మధ్యాహ్నం జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. 

ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తరువాత సంక్షేమ పథకాల ప్రకటన, ఓటర్లను ప్రలోభపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడిచేయాలని విపక్షాలు డిమాండ్ చేశారు. ముందుగా నియోజకవర్గాల వారిగా ఓటర్ల జాబితా అందించాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే..ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు పారదర్శకంగా ఉండేలా పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. అత్యంత పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా శాంతి భద్రతలను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని కొన్ని పార్టీలు విజ్ఞప్తి చేశాయి

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ డబ్బుతో ఓట్ల కొనుగోలు ప్రయత్నాలు ఆపాలని కోరినట్లు తెలిపారు. దరఖాస్తులన్నీ పరిష్కరించే వరకు ఓటర్ల తుది జాబితా ప్రకటించవద్దని కోరినట్లు చెప్పారు.

రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపాలని ఎక్కువ మంది పరిశీలిస్తున్న నియమించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పులు చేస్తోందని ఈసీ దృష్టికి తీసుకువచ్చినట్లు బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రతినిధి బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన తప్పులు వల్ల తమ పార్టీకి తీరని నష్టం జరిగిందని, ఈసారి అలా కాకుండా చూడాలని ఈసీ బృందానికి వివరించమని తెలిపారు. 

నేడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ కానుంది. రేపు దివ్యాంగ ఓటర్లకు ఏర్పాట్ల విషయమై సమీక్ష నిర్వహించనున్నారు.మూడో రోజున మీడియాతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు మాట్లాడే అవకాశం ఉంది.