డబ్బులు కొట్టు - డబుల్ బెడ్రూం ఇళ్లు పట్టు.. జగిత్యాలలో కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటం (వీడియో)
డబ్బులు తీసుకుని డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారులనే మార్చేసిన ఓ కంప్యూటర్ ఆపరేటర్ అవినీతి భాగోతం జగిత్యాలలో బయటపడింది.
జగిత్యాల : నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్రూం ఇళ్ళను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుచోట్ల ఈ ఇళ్ల పంపిణీ కూడా జరిగిపోయింది. అయితే జగిత్యాల పట్టణంలో జరిగిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్, ఓ మీ సేవ నిర్వహకుడు ఈ అవకతవకలకు పాల్పడినట్లు అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ వ్యవహారం జగిత్యాలలో కలకలం సృష్టించింది.
జగిత్యాల డీఎస్పీ వెంకటస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పేదలకోసం జగిత్యాల పట్టణంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించింది. ఇళ్ళ నిర్మాణం పూర్తవడంతో పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. అయితే అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాల్సి వుండగా అవకతవకలు జరిగినట్లు బయటపడింది. ఓ హౌసింగ్ శాఖ ఉద్యోగి, మీ సేవ నిర్వహకుడు కలిసి అధికారులు ఎంపికచేసిన లబ్దిదారుల లిస్ట్ నే మార్చారు. అతి తెలివితో ఈ పని చేసినా ఉన్నతాధికారులు దీన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
వీడియో
హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే బోగె రాకేష్, బీర్పూర్ కు చెందిన మీ సేవ ఆపరేటర్ మాటేటి చంద్రశేఖర్ కలిసి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వీరు డబుల్ బెడ్రూం ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్న కొందరివద్ద డబ్బులు వసూలు చేసి అర్హుల జాబితాలో చేర్చినట్లు హౌసింగ్ డిఈ రాజేశ్వర్ గుర్తించారు. ఆయన ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు జరిపి అవకతవకలు జరిగింది నిజమేనని తేల్చి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read More సంక్షేమం పేరుతో బీఆర్‌ఎస్ సర్కారు ప్రజాధనాన్ని పార్టీ కార్యకర్తలకు పంచుతోంది : కాంగ్రెస్
ఇద్దరు నిందితులు మొత్తం 52 మంది వద్ద డబ్బులు తీసుకుని డబుల్ బెడ్రూం లబ్దిదారుల జాబితాలో చేర్చినట్లు జగిత్యాల డిఎస్పీ తెలిపారు. ఒక్కొక్కరి వద్ద రూ.5000 నుండి రూ.60,000 వరకు తీసుకుని ఈ పని చేసారని తెలిపారు. మొత్తంగా ఈ డబుల్ బెడ్రూం ఇళ్ళ వ్యవహారంలో రూ.4 లక్షలు చేతులు మారినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు డిఎస్పీ వెంకట స్వామి వెల్లడించారు.
కంప్యూటర్ ఆపరేటర్ రాకేష్, మీ సేవ నిర్వహకులు చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. వీరిలో కోర్టులో హాజరుపర్చి కస్టడీలోకి తీసుకోనున్నామని... ఈ అవకతవకలకు సంబంధించి పూర్తి సమాచారం రాబడతామని పోలీసులు తెలిపారు. ఈ అవినీతి వ్యవహారంతో సంబంధం ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టబోమని... ఎంతటి వారైనా చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని డిఎస్పి వెంకట స్వామి హెచ్చరించారు.