ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను చలి వణికిస్తోంది. రోజు రోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు స్థానికుల్ని కలవరపెడుతున్నాయి. కుమురంభీం జిల్లా గిన్నెదరి లో 4.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఆదిలాబాద్‌ జిల్లా అర్లి-టి గ్రామంలో 4.6 డిగ్రీలకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది.

తెలంగాణరాష్ట్రం లోనే ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు కరోనా కూడా ఉండడంతో చలికి వణికిపోతున్నారు. వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోందని వాపోతున్నారు. 

ఉదయం, సాయంత్రం వేళల్లో అదీ అత్యవసరమైతే తప్పా బయటకు రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం టీ దుకాణాలను, మంటలను ఆశ్రయిస్తున్నామని పేర్కొంటున్నారు. 

చలి కారణంగా పొగ మంచు కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట కూడా వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. చలి నుంచి రక్షణకు స్వెట్టర్లు,గ్లౌజులు, మఫ్లర్ ల లాంటివి ధరించినా చలిని తట్టుకోలేక పోతున్నామని జిల్లా వాసులు చెబుతున్నారు.