గత కొద్ది రోజులు తెలంగాణ ప్రజలను చలి చుట్టేసి ఊపిరాడనివ్వట్లేదు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టనివ్వడం లేదు. సాయంత్రం ఆరు గంటలు కావడంతోనే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. మళ్లీ ఉదయం ఎనిమిది గంటల వరకు అదే పరిస్థితి కొనసాగుతున్నది. 2017 డిసెంబర్ 27న ఆదిలాబాద్‌లో అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఈ సారి ఉమ్మడి ఆదిలాబాద్‌లోనూ అదే టెంపరేచర్ రికార్డ్ అయింది.
హైదరాబాద్: కొద్ది రోజులుగా తెలంగాణ(Telangana) ప్రజలు చలితో వణికిపోతున్నారు. సాధారణంగా శీతాకాలం(Winter)లో ఉండే చలి కంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు(Temparature) మరింత తగ్గాయి. అందుకే రాజధాని నగరం హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. అందుకే చలి పులి గజగజ వణికిస్తున్నది. ఈ నెల 27వ తేదీ వరకు ఇలాగే కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత కొద్ది రోజులు ఉష్ణోగ్రతలు పెరిగినా మళ్లీ తగ్గిపోయి జనవరి రెండో వారం వరకూ తక్కువ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు. మరో మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు టీఎస్‌డీపీఎస్ అంచనా వేసింది.
సాయంత్రం ఆరు అవుతుండగానే చలి చుట్టేస్తున్నది. మళ్లీ ఉదయం 8 గంటలైనా పొగ మంచు తెరలుగా కనిపిస్తూనే ఉన్నది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గంటలకు ఆరు కిలోమీటర్ల శీతల గాలులు(Cold Waves) వీస్తున్నాయి. ఆ ఫలితంగానే ఉత్తర తెలంగాణపై చలి ప్రభావం ఎక్కువగా ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ శీతల గాలుల వల్లే మంగళవారం నాడు ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మరింత కఠినం కావడంతో ఈ రెండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: Winter: చలికాలంలో.. మృదువైన చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు కి సింపుల్ చిట్కాలు..!
1980 నుంచి ఉష్ణోగ్రత రికార్డులను పరిశీలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2017 డిసెంబర్ 27న అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అంత తక్కువ స్థాయిలో టెంపరేచర్ రికార్డ్ కాలేదు. కానీ, మంగళవారం తాజాగా, కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెదరిలో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. గిన్నెదరితోపాటు సర్పూర్(యూ), ఆదిలాబాద్ జిల్లా బేలలో 3.8 డిగ్రీలు, భీమ్‌పైర్ మండలం అర్లి(టీ)లో 3.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది.
Also Read: Cold Wave: చలి చంపేస్తోంది బాబోయ్.. మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. అధికారుల హెచ్చరికలు
సాధారణంగా ప్రతి శీతాకాలంలో ఆదిలాబాద్‌లో అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వీటితోపాటు మంగళవారం నాడు సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనరపర్తిల్లో 10.6 డిగ్రీల నుంచి 11.8 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 9.7 శాతం నుంచి 3.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఇదిలా ఉండగా, రాష్ట్ర రాజధాని నగరంలోనూ టెంపరేచర్ పడిపోయి బయట అడుగు పెట్టడానికి జనాలు జంకుతున్న పరిస్థితులుఉన్నాయి. సాధారణంగా ఇక్కడ ఏ శీతాకాలంలోనైనా పది డిగ్రీల కంటే తక్కువగా రిపోర్ట్ కాదు. కానీ, తాజాగా హైదరాబద్ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యల్పంగా రాజేంద్రనగర్‌లో ఉష్ణోగ్రత 8.4 డిగ్రీలుగా రికార్డ్ అయింది. కాగా, శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు, రామచంద్రాపురంలో 9.1 డిగ్రీలు, సికింద్రాబాద్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
