Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్

  • ఉత్తమ్ తో వెంకటరెడ్డి కి కుదిరిన సయోధ్య
  • విబేధించిన రాజగోపాల్ రెడ్డి
  • బస్సు యాత్రకు దూరంగా రాజగోపాల్
Cold war raging between komatireddy brothers

నల్లగొండ జిల్లాలో బలం, బలగం ఉన్న నాయకుల జాబితాలో కోమటిరెడ్డి సోదరులు ముందు వరుసలో ఉంటారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కోమటిరెడ్డి సోదరులకు అనుచరులు, ఫాలోయర్లు ఉంటారు. జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల హవా మామూలుగా ఉండదు. ఇంతకాలం సోదరులిద్దరిదీ ఒకే మాట, ఒకే బాటగా సాగింది. కానీ గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ప్రచారం జోరుగా కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా గాంధీభవన్ వర్గాల్లో ఈ చర్చ ఇటీవల కాలంలో బాగా నడుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన నాటినుంచి కోమటిరెడ్డి సోదరులిద్దరూ పిసిసి ప్రసిడెంట్ ఉత్తమ్ తో కానీ, మాజీ అధ్యక్షులు పొన్నల లక్ష్మయ్యతో కానీ సయోధ్యతో ఉన్న దాఖలాలు లేవు. ఇక ఉత్తమ్ ను పిసిసి అధ్యక్షుడిగా చేసిన తర్వాత వీరు ఉత్తమ్ ను ఏనాడూ లెక్క పెట్టలేదన్న విమర్శ ఉంది. ఉత్తమ్ ను పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిస్తే పార్టీ గెలవడం కష్టం అని కూడా కామెంట్ చేశారు. అయితే ఇటీవల కాలంలో సోదరులిద్దరిలో పెద్దాయన వెంకట్ రెడ్డి ఉత్తమ్ తో విబేధాలను పరిష్కరించుకున్నారు. ఉత్తమ్ నాయకత్వంలో అయినా తాను పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. గత కొంతకాలంగా బస్సు యాత్రలో పెద్ద బ్రదర్ పాల్గొంటున్నారు. తొలిరోజు బస్సు యాత్ర ప్రారంభంలో చేవెళ్ల సభలో కార్యకర్తలను ఉత్తేజపరిచిన నాయకుల్లో ఒకరు రేవంత్  రెడ్డి అయితే.. ఇంకొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డే.  ఇక తాను అవసరమైతే ఎంపిగా పోటీ చేస్తానని, తన స్థానంలో ఒక యువకుడిని బరిలోకి దింపుతానని కూడా అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సయోధ్య కుదిరిన తర్వాతే కోమటిరెడ్డి అధికార టిఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చురుకుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

మరి ఈ నేపథ్యంలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డితో సయోధ్య చేసుకోవడం ఇష్టం లేదన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే ఇప్పటి వరకు ఉత్తమ్ నేతృత్వంలో సాగుతున్న బస్సు యాత్రలో రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు. ఆయన భవిష్యత్తులో పాల్గొంటారో లేదో కూడా తెలియదు. అయితే పెద్ద బ్రదర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే తన భవిష్యత్తును వెతుక్కుంటుండగా చిన్న బ్రదర్ మాత్రం అవసరమైతే కాంగ్రెస్ ను వీడే చాన్స్ కూడా ఉందన్న ప్రచారం షురూ అయింది. జెఎసి పార్టీ వైపు రాజగోపాల్ రెడ్డి చూపు మళ్లిందన్న గుసగుసలు కాంగ్రెస్ పార్టీలో వినబడుతున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డి టచ్ లోకి వచ్చారా రాలేదా అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా ఇంతకాలం రామ లక్ష్మణుల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చక్రం తిప్పిన కోమటిరెడ్డి బ్రదర్స్ గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు నల్లగొండ రాజకీయ వర్గాల్లోనూ టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్నది భవిష్యత్తులో తేలే అవకాశం ఉందని చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios