కరీంనగర్: దీపావళి పర్వదినం సందర్భంగా సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపికబుురు చెప్పింది. బోనస్ పై ఇప్పటి వరకు నెలకొన్న సందిగ్ధతకు తెరదించింది. దీపావళి కానుకగా ప్రతీ కార్మికుడికి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

ఈనెల 25న ప్రతీ కార్మికుడికి రూ.64,700 ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. గత ఏడాది ప్రతీ కార్మికుడికి రూ.60,500 బోనస్ గా ఇచ్చారు. అయితే జాతీయ సంఘాలు జోక్యం చేసుకుని దాన్ని 64,700కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దీపావళి నుంచి రూ.64,700 బోనస్ చెల్లిస్తామని ఆనాడు యాజమాన్యం ప్రకటించింది.

ప్రస్తుతానికి సింగరేణి కాలరీస్ లో 48వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి యాజమాన్యం రూ.280 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న దీపావళి సందర్భంగా కార్మికులు బోనస్ అందుకోనున్నారు.

ఇకపోతే బోనస్ పై సింగరేణి కాలరీస్ కార్మిక సంఘాల ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యాయి. బోనస్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాయి. అందులో భాగంగా బుధవారం యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. 

ఇకపోతే బొగ్గు సంస్థల్లో ఏటా ప్రాఫిట్‌ లింక్‌డ్‌ రివార్డ్‌ బోనస్‌ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని ఇతర బొగ్గు సంస్థల్లో ఈబోనస్ ను దసరాకు ముందు ఇస్తుండగా సింగరేణి కాలరీస్ లో మూడు దశాబ్ధాలుగా దీపావళికి వారం రోజుల ముందు అందించడం సంప్రదాయంగా కొనసాగుతుంది.  

అయితే మంగళవారం యూనియన్ నేతలతో బోనస్ పై ఇప్పట్లో ఎలాంటి హామీ ఇవ్వలేమని యాజమాన్యం చెప్పినట్లు ప్రచారం జరిగింది. అక్టోబర్ నెల జీతం అందుకోండి తర్వాత బోనస్ గురించి ఆలోచిద్దాం అని యూనియన్ నేతలతో యాజమాన్యం చెప్పినట్లు ప్రచారం జరిగింది.  

విద్యుత్ సంస్థలు సింగరేణికి రూ.7,000 కోట్లు బకాయిలు పడ్డాయని అందువల్లే బోనస్ ఇవ్వలేమని యాజమాన్యం చెప్పిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాంతో సింగరేణిలో పనిచేసే కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడూ బోన్‌సను ఆపలేదని, నిర్ణీత సమయంలోగా రెండు విడతల్లో అందజేసిన దాఖలాలున్నాయని కార్మికులు చెప్పుకొచ్చారు. 

గత ఏడాది రూ.1,766 కోట్ల లాభాలను ప్రకటించిన యాజమాన్యం రూ. 494 కోట్లను కార్మికులకు పంపిణీ చేసిందని అయితే ఇప్పుడు చెల్లించలేదా అని కార్మికులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా ఈనెల 25న బోనస్ ఇస్తున్నట్లు సింగరేణి కాలరీస్ యాజమాన్యం ప్రకటించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.