గృహ జ్యోతి: 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మీ పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ ఉన్నత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Griha Laxmi Scheme: మరో ఎన్నికల హామీని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. తాజాగా, విద్యుత్ విధానాలపై సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సరైన విద్యుత్ విధానాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వివిధ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ వినియోగం, డిస్కంల పని తీరు వంటి అంశాలపై ఉన్నత అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరాలు అందించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఒప్పందాలు, ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్ కోసం చెల్లించిన ధరలు, ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. అంతేకాదు, బహిరంగ మార్కెట్‌లో చౌకగా ఎక్కడ విద్యుత్ లభిస్తుందో అక్కడే కొనుగోలు చేయాలని సూచనలు చేశారు.
Also Read: TSRTC: సంక్రాంతికి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించిన ఆర్టీసీ.. కారణాన్ని వెల్లడించిన సజ్జనార్
మెరుగైన విధానాల కోసం అధ్యయనాలు చేయాలని, ఇతర రాష్ట్రాల్లోని విధానాలనూ పరిశీలించాలని, నిపుణులతో చర్చలు జరపాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత అసెంబ్లీలోనూ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో చర్చించి కొత్త విద్యుత్ పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అదే విధంగా రాష్ట్రంలో గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ పథకం కింద ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాల్సి ఉంటుంది.