నేడు సిద్దిపేటలో అడుగుపెట్టనున్న సీఎం కేసీఆర్.. లక్షమందితో ప్రజా ఆశీర్వాద సభ
సీఎం కేసీఆర్ తన పురిటిగడ్డ సిద్దిపేటలో నేడు అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కాకున్నారు.
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ తన పురిటిగడ్డ సిద్దిపేటలో నేడు అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట లో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కాకున్నారు. సిద్దిపేట పట్టణ శివారులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభాస్థలికి సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ చేరుకుంటారు. దాదాపు లక్ష మంది జనసమీకరణతో సభను నిర్వహించి, సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదని చాటేందుకు పార్టీ శ్రేణులు సన్నద్దమవుతున్నారు.
గులాబీమయం
సిద్దిపేట వేదికగా జరుగనున్న ఈ సభకు సీఎం కేసీఆర్ రానున్నడంతో ఈ సభపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో (సీఎం కేసీఆర్ సభతో)సిద్దిపేటంతా గులాబీమయంగా మారింది. సభ జరిగే ప్రదేశంతో పాటు సిద్దిపేట పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు భారీ కట్ అవుట్ లు వెలిశాయి. ఈ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
భారీ జనసమీకరణే లక్ష్యంగా మండలాలు, గ్రామాల వారీగా ఇన్చార్జీలను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన తర్వాత సిద్దిపేటలో నిర్వహించే మొదటి సభ, సీఎం కేసీఆర్ పురిటిగడ్డపై నిర్వహించే సభ కావడంతో గులాబీ పార్టీ నేతలు, శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాన్నారు. సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఈ ప్రజా ఆశీర్వాద సభకు పెద్దఎత్తున జనాన్ని తరలించి సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు తలమునకలయ్యారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభ లో సీఎం కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
పటిష్ఠ బందోబస్తు
సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. సభాస్థలి, పార్కింగ్ ప్రదేశాలు, హెలిప్యాడ్ తదితర ప్రాంతాలను పోలీస్ అధికారులతో కలిసి సీపీ శ్వేత సందర్శించారు.
ఈ సందర్భంగా సీపీ శ్వేత మీడియాతో మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు విధి నిర్వహణలో ఉండే పోలీసులకు సహకరించాలనీ, వారి సూచనలను పాటించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలనీ, కేటాయించిన ప్రదేశాలలోనే వాహనాలను పార్కు చేయాలని సూచించారు. ఈ సభ నేపథ్యంలో అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో 6 సెక్టార్లుగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నాం నుంచి రాత్రి 7.30 వరకు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షాలుంటాయనీ, ఇందుకు సహకరించాలని ప్రజలను కోరారు.
సిద్దిపేట మట్టి బిడ్డకు ఘన స్వాగతం పలకండి : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట మట్టి బిడ్డ సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకాలని మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రజాఆశీర్వాద సభను లక్ష మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నియోజక వర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి 20వేల మంది యువకులు మోటార్ సైకిళ్లపై సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలపై, పార్టీ ఏర్పాటు చేసిన వాహనాల్లో సభకు తరలి రావాలని కోరారు. సిద్దిపేట మట్టిబిడ్డ కేసీఆర్ పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ఈ సభను విజయవంతం చేయాలని కోరారు