సర్వమత సమ్మేళనంగా తెలంగాణ సెక్రటేరియట్... గుడి, మసీదు, చర్చి ప్రారంభించనున్న కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం నూతనంగాా నిర్మించిన సెక్రటేరియట్ ప్రాంగణంలో సర్వమత ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది.
హైదరాబాద్ : సచివాలయం... రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించేందుకు పాలకులు నిర్ణయాలు తీసుకుని, అమలుచేసే పవిత్రమైన పాలన కేంద్రం. ఇక్కడ అందరూ ఒక్కటే... కులమతాల తేడాలుండవు. పాలకుల దృష్టిలో ప్రజలందరూ సమానమేనని... సర్వమతాలను గౌరవించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన కేంద్రమైన సచివాలయ ప్రాంగణంలో దేవాలయంతో పాటు మసీదు, చర్చి నిర్మించారు. ఇప్పటికే వీటి నిర్మాణం పూర్తవగా ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం ఖరారు చేసారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభుత్వానికి సర్వమతాలు సమానమేనని సూచించేలా గుడి, మసీదు, చర్చిని కూడా నిర్మించారు. వీటి నిర్మాణం పూర్తవడంతో ఆగస్ట్ 25న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రార్థన మందిరాల నిర్మాణాలను రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ ఆండ్ బి ఇఎన్సీ గణపతి రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుడి, మసీద్, చర్చి పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని మేజర్ పనులు పూర్తయ్యాయని... చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ పనులు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తామని గణపతి రెడ్డి తెలిపారు.
Read More ఉద్యమ సహచరుడికి సీఎం అపూర్వ గౌరవం... స్టీల్ బ్రిడ్జికి నాయిని నరసింహారెడ్డి పేరు
అన్ని మతాల పెద్దలు, పండితుల సలహాలు, సూచనలు పాటిస్తూ సచివాలయంలో ప్రార్థన మందిరాల నిర్మాణం పూర్తిచేసామన్నారు. ఈనెల 25న సీఎం వీటిని ప్రారంభించాక భక్తులకు అందుబాటులోకి వస్తాయన్నారు. సచివాలయం ఉద్యోగులకు గుడి,మసీద్ ,చర్చి అందుబాటులో వుంటాయని ఆర్ ఆండ్ బి ఇఎన్సీ గణపతి రెడ్డి తెలిపారు.