కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ! నేనే ఆహ్వానించా: ఎమ్మెల్యే గంప గోవర్ధన్
సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాడని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే స్వయంగా కేసీఆర్‌ను ఆహ్వానించానని చెప్పారు. మూడు సార్లు ఆహ్వానించాననీ పేర్కొన్నారు.
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఒక వైపు టికెట్ల కేటాయింపులు జరుగుతుండగా.. సీఎం కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని వివరించారు. అంతేకాదు. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినట్టు ఎమ్మెల్యే గంపగోవర్ధన్ చెప్పారు.
సీఎం కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కొన్నాళ్లుగా జరుగుతున్నది. పార్టీ బలహీనంగా ఉన్న చోటు నుంచి ఆయన పోటీ చేస్తారని కొందరు చెప్పారు. కాగా, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారని, గజ్వేల్ నుంచి పోటీ చేస్తారని, కామారెడ్డి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెడుతూ కొంత స్పష్టత ఇచ్చినట్టే అనిపిస్తున్నది.
కామారెడ్డి నియోజకవర్గంతో కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉన్నదని ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ లాబీలో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక విషయానికి స్పష్టత ఇచ్చారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తే తాను స్వయంగా ఒక కార్యకర్తనై సీఎంను గెలిపించుకుంటున్నా గంపగోవర్ధన్ అన్నారు. ఆ తర్వాత తాను ఏం చేయాలి? ఏ బాధ్యతలు నిర్వర్తించాలో సీఎం కేసీఆరే చెబుతారని వివరించారు.
సీఎం కేసీఆర్ స్వగ్రామం కామారెడ్డి నియోజకవర్గంలోనే ఉంటుందని ఎమ్మెల్యే గంపగోవర్ధన్ చెప్పారు. అయితే, మిడ్ మానేరులో ఆ గ్రామం మునిగిపోవడంతో వారు చింత మడకకు మారారని వివరించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.