జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పులు : సైఫుద్దీన్ కుటుంబానికి కేటీఆర్ బాసట.. బాధితుడి భార్యకు ప్రభుత్వోద్యోగం, ఇంకా
ఇటీవల జైపూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించిన సయ్యద్ సైఫుద్దీన్ కుటుంబానికి మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్‌కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వితంతు పెన్షన్, డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించారు.
ఇటీవల జైపూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్‌కు చెందిన సైఫుద్దీన్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డునపడ్డ కుటుంబానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్‌ను శనివారం అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో కేటీఆర్ కలిశారు. తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
అంజుమ్ షాహీన్‌కు కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియమించిన ఉత్తర్వులను కేటీఆర్ ఆమెకు అందజేశారు. దీంతో పాటు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను మంజూరు చేసిందని తెలిపి, దాని తాలూకు కేటాయింపు పత్రాన్ని కూడా అంజుమ్‌కు కేటీఆర్ అందజేశారు. ఆమెకు వితంతు పెన్షన్ మంజూరు చేయడంతో పాటు సైపుద్దీన్ ముగ్గురు కుమార్తెలకు బీఆర్ఎస్ తరపున రూ.2 లక్షల చొప్పున, మజ్లిస్ తరపున రూ.1 లక్ష చొప్పున మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు వున్నారు. సైఫుద్దీన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ,మంత్రి కేటిఆర్‌లకు హోం మంత్రి మహమ్మద్ మహ్మూద్ అలీ కృతఙ్ఞతలు తెలిపారు.