నాడు ఉద్యమసారథిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇదే గడ్డపై చేసిన ప్రసంగానికి... నేడు సీఎం గా అధికార పార్టీ అధినేతగా కేసీఆర్ చేసిన ప్రసంగానికి ఎంత తేడా... !!  

కేసీఆర్... ఓ మాటల మాంత్రికుడు...

తన మాటల తూటాలతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమజ్వాలను రగిలించారు.

ఉద్యమసారథిగా ఆయన ఏ సభ పెట్టినా జనాలు తండోపతండాలుగా కదిలారు.

తెలంగాణ యాసలో ఆయన చేసిన ప్రసంగాలను చెవులొగ్గి విన్నారు.

ఆయన మాటలు ప్రత్యర్థి పార్టీ నేతలకు కర్రకాల్చి వాతపెట్టినట్లుండేవి..

ఆయన చెప్పే పిట్టకథల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కనిపించేంది.

ఇదంతా గతం... మరిప్పుడో...

సీఎం అయ్యాక ఏదో తేడా చేసింది. కేసీఆర్ తీరే మారింది...

తెలంగాణ యాస పోయింది... తెలంగాణ సోయి పోయింది...

ఈ రోజు వరంగల్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో చప్పగా సాగిన కేసీఆర్ ప్రసంగం చూస్తుంటే... నాటి చెనుకులు.. చమక్కులు మచ్చుకు కూడా కానరాలేదు.

నాడు పిట్టకథలతో జనాలతో జై కొట్టించుకున్న కేసీఆర్ నేడు గొర్రె ముచ్చట్లు చెప్పి చప్పట్ల కోసం కార్యకర్తలను అడుక్కున్నారు.

సభ ఆసాంతం చప్పగా సాగింది. కేసీఆర్ ప్రసంగంలో కొత్తగా ఒక్క పదం కూడా చేరలేదు. ప్రతిపక్షాలను దద్దమ్మలంటూ తిట్టిపోయడం... తమ ప్రభుత్వ ఘనతను ఎత్తుకోవడం తప్పితే పెద్దగా చెప్పిందేమీ లేదు... అక్కడున్న కార్యకర్తలను ఉపన్యాసంతో కదిలించిదీ ఏమీ లేదు.

పార్టీ సిద్దాంతకర్త జయశంకర్ ను టీఆర్ఎస్ విస్మరిస్తుందనే విమర్శలు రావడంతో కేసీఆర్ ఈ సభలో స్పందించారు. తన ప్రసంగం మొదట్లోనే జయశంకర్ సర్ ను స్మరిస్తూ పార్టీ కార్యకర్తలతో జై కొట్టించారు.

ఇక ఆ తర్వాత సాగిన ఆయన ప్రసంగం అంతా అందరి రాజకీయనాయకుల ఊకదంపుడు ఉపన్యాసంలానే ఉంది.

కరెంటు కథలు... గొర్రె పథకాలు... పదే పదే వినిపించడం ... ప్రతిపక్ష పార్టీలను దద్దమ్మలుగా విమర్శించడం తప్పితే తన శ్రేణులకు ఏలాంటి దిశానిర్దేశం చేయలేదు.

నిన్న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో తానేందుకు ప్రసంగించలేదో వివరణ ఇస్తారనుకుంటే అదీ చేయలేదు.

కోర్టు కొట్టేసిన సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు.