Asianet News TeluguAsianet News Telugu

ధరణి ఎత్తేసేందుకు కాంగ్రెస్ రెడీ .. ఉండాలో , వద్దో తేల్చుకోండి : సిరిసిల్లలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

రైతుబంధు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వుందని.. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు . ధరణి ఉండాలా.. పోవాలా..? అన్నది మీరే నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

cm kcr slams congress party at brs public meeting in sircilla ksp
Author
First Published Oct 17, 2023, 5:42 PM IST | Last Updated Oct 17, 2023, 5:42 PM IST

రైతుబంధు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వుందని.. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. 3 కోట్ల టన్నుల వడ్లు పండించి దేశానికి తెలంగాణ అన్నం పెడుతోందన్నారు. తొమ్మిదన్నరేళ్లలోనే తెలంగాణను ఎన్నో అంశాల్లో నెంబర్‌వన్‌గా నిలిపామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వద్దని కాంగ్రెస్ నేత అన్నారని.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ సరిపడా కరెంట్ కూడా ఇవ్వలేదని సీఎం దుయ్యబట్టారు. ఇవాళ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరా లేదన్నారు. 

ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సిరిసిల్ల ప్రాంతంలో తన బంధువులు, మిత్రులు చాలామంది వున్నారని తెలిపారు. ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవన్నారు. ఇప్పుడు అప్పర్ మానేరు చూస్తే ఏడాదంతా నీరు వుంటోందని.. తన 70 ఏళ్ల జీవితంలో సిరిసిల్లలో కనీసం వందసార్లు తిరిగానని కేసీఆర్ చెప్పారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తే ఆదిరించి, గెలిపించారని ఆయన గుర్తుచేశారు. ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎంతో చలించిపోయానని కేసీఆర్ పేర్కొన్నారు. 

Also Read: తెలంగాణ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో లిస్ట్ ఆలస్యం.. ఆ తర్వాతే విడుదల..!!

అప్పర్ మానేరు రూపురేఖలు మార్చామని.. ఇప్పుడు మానేరు జలకళతో నిండుకుండాలా మారిందని సీఎం అన్నారు. సిరిసిల్లలో ఒకప్పుడు చేనేత కార్మికులు ఆత్మహత్యలు వుండేవన్నారు. మంత్రిగా చేనేత కార్మికుల కోసం కేటీఆర్ ఎంతో కృషి చేశారని కేసీఆర్ ప్రశంసించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరలు తెచ్చామని.. చివరికి ఈ కార్యక్రమం పైనా కొందరు రాజకీయం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓట్ల కోసం అడ్డగోలు అబద్ధాలు చెప్పలేదని.. సోలాపూర్ తరహాలో సిరిసిల్ల చేనేత పరిశ్రమ అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. దశలవారీగా పెన్షన్లు, రైతుబంధు పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు. ఆపద మొక్కులు మొక్కేవాళ్లు చాలా మంది వస్తారని.. రైతుల భూములు క్షేమంగా వుండాలనే ధరణి పోర్టల్ తెచ్చామని కేసీఆర్ తెలిపారు. ధరణిలో ఒకట్రెండు సమస్యలు వుంటే మార్చుకోవచ్చని .. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను తీసి బంగాళాఖాతంలో వేస్తారట అంటూ సీఎం దుయ్యబట్టారు. వీఆర్వోలు, తహశీల్దార్ పొట్టలు నింపడానికా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

మీ వేలిముద్రలు లేకుండా భూమి హక్కును ఎవరూ మార్చలేరని సీఎం వెల్లడించారు. గతంలో వేల రూపాయలు పలికే భూమి ఇప్పుడు లక్షల రూపాయలు పలుకుతోందని ముఖ్యమంత్రి  తెలిపారు. ధరణి ఉండాలా.. పోవాలా..? అన్నది మీరే నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 24 గంటల కరెంట్ ఉండాలా.. 3 గంటల కరెంట్ వుండాలా అని సీఎం ప్రశ్నించారు. రేషన్ కార్డు వున్న అందరికీ సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సిరిసిల్ల మంచి విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి వుందని సీఎం హెచ్చరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios