Asianet News TeluguAsianet News Telugu

వైరస్ గురించి భయపడొద్దు, తెలంగాణాలో నాలుగు జోన్లలో మాత్రమే కరోనా: కేసీఆర్

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు,  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

CM KCR Review Meeting On COVID-19: Coronavirus Active Cases Are From Only Four Zones In Hyderabad
Author
Hyderabad, First Published May 16, 2020, 6:14 AM IST

హైదరాబాద్: నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సిఎం తెలిపారు. 

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు,  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

మంత్రులు ఈటల రాజేందర్, కెటి రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందర్ రావు, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని కేవలం నాలుగు జోన్లకే పరిమితం అయింది. ఎల్.బి.నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం ఆక్టివ్ కేసులున్నాయి. ఈ జోన్లలో 1442 కుటుంబాలున్నాయి. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులకు ఎవరికీ పాజిటివ్ లేదు. 

ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఉన్నట్లు పరిగణించడానికి లేదు. పాజిటివ్ కేసులున్న నాలుగు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

‘‘కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ సోకినప్పటికీ కోలుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో, వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకునే తెలంగాణ వాసులకు పరీక్షలు నిర్వహించాలి. వైరస్ ఉంటే ఆసుపత్రికి తరలించాలి. లేకుంటే హోమ్ క్వారంటైన్ లో ఉంచాలి. 

హైదరాబాద్ లో దిగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని విమానాశ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సుల ద్వారా తమ సొంత రాష్ట్రాలకు పంపించాలి. రైళ్ల ద్వారా తెలంగాణకు చేరుకునే వలస కార్మికులకు పరీక్షలు నిర్వహించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తమ సొంత రాష్ట్రాలకు పంపించాలి’’ అని కేసీఆర్ ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios