రైతు బంధు సాయానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రైతు బంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్ధిక సాయం అందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రైతు బంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌‌లో మంత్రులు, అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా లేదా అన్న విషయాలను వెంటనే తెలుసుకోవాలని సూచించారు.

కొంతమంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండటం వల్ల రైతు బంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం వుందని.. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి.. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు నూటికి నూరుశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండటం శుభసూచకమని కేసీఆర్ అన్నారు. ఈ ఒరవడి భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని సీఎం పేర్కొన్నారు.

సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతిపెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.