లోక్ సభపై సీఎం కేసీఆర్ నజర్.. మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి ఎంపీగా పోటీ ?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సారి మహారాష్ట్ర నుంచి లోక్ సభ కు ఎన్నికవ్వాలని చూస్తున్నారు. అక్కడి నాందేడ్ లేదా ఔరంగాబాద్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి, జాతీయ స్థాయి రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నజర్ లోకసభపై పడినట్టు తెలుస్తోంది. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లేదా నాందేడ్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీని వల్ల పార్టీ జాతీయ స్థాయిలో బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన కేసీఆర్ కు గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం ఉంది. ఆయన తెలంగాణలోని మూడు లోక్ సభ నియోజకర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇందులో మూడు సార్లు కరీంనగర్ నుంచి (2004, 2006, 2008 సంవత్సరాల్లో), 2019లో మహబూబ్ నగర్ నుంచి లోక సభకు ఎన్నికయ్యారు. అలాగే తెలంగాణ వచ్చిన తరువాత 2014లో జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయన మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే అదే సమయంలో అసెంబ్లీకి ఎన్నికవడంతో తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తరువాత తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
2018లో ముందుస్తు ఎన్నికలకు వెళ్లి మరో సారి ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండో సారి కూడా కేసీఆర్ సీఎంగా పదవి చేపట్టారు. కాగా.. కొంత కాలం నుంచి బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తోంది. దానినికి అనుగుణంగానే పార్టీ పేరు కూడా (గతంలో టీఆర్ఎస్ గా ఉండేది) మార్చారు. పార్టీ విస్తరణలో భాగంగా ముందుగా మహారాష్ట్రపైనే సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. పలు మార్లు ఆ రాష్ట్రాన్ని సందర్శించారు. అక్కడి నేతలను పార్టీలో చేర్చుకున్నారు.
జిమ్ లో ట్రెడ్ మిల్ పై పరుగెత్తుతుండగా కరెంట్ షాక్.. యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
కాగా.. ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ‘ఇండియా’కు, బీజేపీ మిత్రపక్షాల కూటమి అయిన ‘ఎన్డీఏ’కు బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. లోక్ సభ ఎన్నికల కోసం ఈ రెండు కూటమిల్లోనూ చేరకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని చూస్తోంది. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ ను మహారాష్ట్రలోని 48 లోక సభ స్థానాల నుంచి పోటీకి సీఎం కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ 48 నియోజకవర్గాల్లో నుంచి నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి ఆయన స్వయంగా లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
రుణాల ఎగవేత వ్యవహారం.. వైసీపీ ఎమ్మెల్యే ఆస్తులు వేలం వేయనున్న కెనరా బ్యాంకు..
మహారాష్ట్రలోని 27 నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది కమిటీలు ఏర్పాటు చేసింది. మొత్తంగా 15 జిల్లాలో పార్టీ కార్యకలపాలు సాగుతున్నాయి. అయితే ఈ సారి బీఆర్ఎస్ అధినేత మహారాష్ట్ర నుంచి లోక్ సభకు ఎన్నికై, జాతీయ రాజకీయాల్లో తన బలాన్ని చూపెట్టాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. దాని కంటే ముందు వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే ఆయన ఫోకస్ మొత్తం పెట్టారని పేర్కొన్నాయి.