తెలంగాణలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో గ్రామీణ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు పే స్కేల్ అమలుతో పాటు పదవీ విరమణ కోరితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆయన ప్రకటించారు.

శుక్రవారం కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీఆర్‌ఏ సమస్యలపై ప్రశ్న సందర్భంగా సీఎం ఈ  హామీ ఇచ్చారు.

Also Read:కొత్త రెవిన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

గ్రామీణ ప్రాంతంలో వీఆర్ఏలు ఎంతో సేవ చేస్తున్నారని.. ఎన్నో ఏళ్లుగా వీరు అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో వారు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు వీఆర్ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానం లేదన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది.

Also Read:వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు వేర్వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు: కేసీఆర్

బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇకపై తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ శాస్వతంగా రద్దు కానుంది. ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ ప్రక్రియ కూడా జరుగనుంది.