తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాలు గెలవాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. వారిని  గెలిపించే బాధ్యత కూడా సీఎం తీసుకున్నారని ఆరోపించారు. 

సిరిసిల్ల : తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే బాధ్యత తీసుకున్నారంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ పండ్ ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా ఎలాగూ బిఆర్ఎస్ లో చేరతారు... కాబట్టి గెలిచే అభ్యర్థులకు పైసలు పంచుతున్నాడని అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకోవాలని కేసీఆర్ కూడా కోరుకుంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. 

బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందని బండి సంజయ్ అన్నారు. దీంతో ఎక్కడ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళతారోనని భయపడ్డ కేసీఆర్ సిట్టింగ్ లకే టికెట్లు కేటాయించాడని అన్నారు. కానీ ఎన్నికల వచ్చేసరికి కేసీఆర్ ప్రకటించిన జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని... ఇప్పుడు ప్రకటించిన జాబితాలో సగంమందికి బిఫారాలు దక్కవని సంజయ్ అన్నారు. 

వీడియో

తెలంగాణ ప్రజలు బిజెపికి అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు సిద్దంగా వున్నారని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ప్రజలకు అర్థమయ్యిందని... అందుకే వారిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇంటలిజెన్స్ వర్గాల రిపోర్ట్స్ కూడా బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయన్నారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు కలిసి యుద్ధం చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేసారు. 

Read More అమిత్ షా సభలో ప్లెక్సీ వివాదం... ఇలాగైతే బహిష్కరిస్తామంటూ ఈటల వర్గీయులు వార్నింగ్ ?

తెలంగాణ బిజెపి నాయకులంతా కలిసి పార్టీ కోసం పనిచేయాలని... వ్యక్తుల కోసం కాదని సంజయ్ సూచించారు. ఎవరైన పార్టీ లైన్ దాటి క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు పార్టీ గెలుపు కోసం కృషిచేయాలని... కష్టపడేవారికే పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని సంజయ్ అన్నారు.

బిజెపి అధికారంలోకి రాగానే చేనేత రంగానికి సెస్ నుండి సబ్సిడీ ఇస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. రిపోర్టర్లు కేసీఆర్ ఉడత ఊపులకు భయపడకుండా ధైర్యంగా వుండాలని... వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే వారికి హెల్త్ కార్డులు, ఇళ్లు ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. 

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి పోవడమే మంచిదయ్యిందని సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అధ్యక్షుడిగా బాధ్యతలు ఎక్కువగా వుండటంతో కార్యకర్తలకు దూరం కావాల్సివచ్చిందని... ఇక నుంచి అందరికీ అందుబాటులో వుంటానని అన్నారు. బిజెపి కార్యకర్తల కష్ట సుఖల్లో పాలు పంచుకుంటాని బండి సంజయ్ అన్నారు.