తెలంగాణలోనూ ఏక్‌నాథ్ షిండేలను తయారు చేస్తామంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు సీఎం కేసీఆర్. తమతో గోక్కుంటే అగ్గేనని, మీ ఉడుత ఊపులకు తాము భయపడమని కేసీఆర్ స్పష్టం చేశారు. 

దమ్ముంటే తెలంగాణలో ఏక్‌నాథ్ షిండేను తీసుకురావాలని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. తానేవరికీ భయపడనని.. తనకు మనీలేదు, లాండరింగ్ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మాతో గోక్కుంటే అగ్గేనని.. మీరు మాతో గోక్కున్నా .. గోక్కోకపోయినా నేను మిమ్మల్ని గోకుతూనే వుంటానని కేసీఆర్ పేర్కొన్నారు. మీ ఉడుత ఊపులకు భయపడేది లేపదన్నారు.

పిల్లలు ఆడుకునే పతంగి మాంజాల నుంచి జాతీయ పతాకాల దాకా అన్నీ చైనావేనంటూ కేసీఆర్ చురకలు వేశారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టడమే బీజేపీ పని అంటూ కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ పాలనలో ఆర్ధిక వ్యవస్థ నాశనం అయ్యిందని... పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా తరలి వెళ్లిపోతున్నాయని సీఎం గుర్తుచేశారు. 

బీజేపీ వస్తే రైతు బీమా, రైతు బంధు ఇస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. కోర్టులు, జర్నలిస్టులంటే కేంద్రానికి గౌరవం లేదని సీఎం మండిపడ్డారు. తెలంగాణలోనూ ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తామని చెబుతున్నారని.. బీజేపీ నేతలు ప్రజాస్వామ్య హంతకులు కారా అని కేసీఆర్ ప్రశ్నించారు. బ్యాంకు దొంగల్ని ఎందుకు పట్టుకోవడం లేదని సీఎం నిలదీశారు. బ్యాంకు దొంగల్లో మీరూ భాగస్వాములేనని కేసీఆర్ ఆరోపించారు. బ్యాంకు దొంగలను దేశానికి తీసుకురావడం మీకు చేతకాదా అని ఆయన నిలదీశారు. 

ALso Read:గాలి పటాల మాంజాలు.. త్రివర్ణ పతాకాలు అన్నీ చైనావే, ఇదేనా మేకిన్ ఇండియా: మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు

తెలంగాణకు చేతకాని బీజేపీ అవసరం లేదని... మీరు విశ్వ గురువులా, విష గురువులా అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.4 వేలకు దొరికే బొగ్గును రూ.30 వేల నుంచి రూ.40 వేలు పెట్టి కొనాలనడం జబర్దస్తీ కాదా అని సీఎం మండిపడ్డారు. దేశ చరిత్రలోనే అత్యంత అసమర్ధ ప్రధాని మోడీనే అని కేసీఆర్ అభివర్ణించారు. మీ అసమర్ధ విధానాల వల్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు విదేశాలకు తరలిపోతున్నాయని సీఎం అన్నారు. మోడీ విదేశాలకు వెళ్లి గుప్పెడు మంది పెట్టుబడిదారులకు సేల్స్‌మెన్ గా పనిచేశాడంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.

నుపుర్ శర్మ వ్యాఖ్యల్ని తప్పుబడితే సుప్రీంకోర్టుపై కూడా లేఖలు రాయిస్తారా అని సీఎం ప్రశ్నించారు. నుపుర్ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టిందని... ఆ న్యాయమూర్తులకు తాను సెల్యూట్ చేస్తున్నానని కేసీఆర్ ప్రశంసించారు. దేశంలో బీజేపీయేతర డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు రావాలని.. బీజేపీకి కళ్లు నెత్తికెక్కాయని సీఎం మండిపడ్డారు. దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని... పార్టీలను, నాయకులను భయపెడతారని ఇదేం ప్రభుత్వమని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 

జడ్జిలనే బెదిరిస్తున్నారని.. ఇదేనా న్యాయవ్యవస్థపై మీకు వున్న గౌరవం అంటూ ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలుస్తున్నారని.. మాజీ జడ్జిలను తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిలను ట్రోల్ చేస్తారా అంటూ సీఎం మండిపడ్డారు. కట్టప్ప కథ ఈ సన్నాసికి తెలుసానంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా ముఠాగోపాల్ దెబ్బకు గింగిరాలు తిరిగాడన్నారు. ఢిల్లీలో కాళ్లు పట్టుకుని యూపీ నుంచి ఎంపీ అయ్యాడని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రైతుల్ని ఉగ్రవాదులు అన్నారని , మళ్లీ క్షమాపణలు చెప్పారని దుయ్యబట్టారు. రైతులు ఉగ్రవాదులైతే ఎందుకు క్షమాపణ చెప్పారని కేసీఆర్ ప్రశ్నించారు.