కాంగ్రెస్ పార్టీపై కెసిఆర్ ఫైర్ అయినదానికి కానిదానికి కోర్టుకు వెళ్తుంది దుష్ట పన్నాగాలను తిప్పికొడతాం త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తా

తెలంగాణ సిఎం కెసిఆర్ చాలారోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆకాశమే హద్దుగా తిట్ల దండకం అందుకున్నారు. ఒక్క తిట్లదండకమే కాదు విమర్శలు, దూషణలు, శాపనార్థాలు అన్నీ కలగలిపి బాంబులు పేల్చారు. అస్తమానం కోర్టులకు పోవడం, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ కు పరిపాటిగా మారింది. సింగరేణి ఉద్యోగుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుందన్నారు. విద్యుత్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై కోర్టకు వెళ్లి వాళ్ల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. కొండపోచమ్మ ప్రాజెక్టుపైనా కేసులేశారని, మల్లన్న సాగర్ మీద కూడా కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇసుక విషయంలో నానా రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో కరెంటు ఇయ్యకపోతే ధర్నాలు చేశారని, కానీ నేడు కరెంటు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పిచ్చి లేసి అడ్డగోలుగా వ్యహరిస్తుందన్నారు. ప్రభుత్వ తప్పలను ఎక్స్ పోస్ చేస్తే రాజకీయం అవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిల్లర, దగాకోరు, దివాళాకోరు రాజకీయాలు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి కారణంగా లక్ష మంది కాంట్రాక్టు ఉద్యోగులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

అచ్చంపేటలో సిగ్గులేకుండా అన్ని పార్టీలు కలిపి మహా కూటమి ఏర్పాటు చేసినా ఒక్క సీటు గెలవలేదని గుర్తు చేశారు. ఒక్క సీటులో అయినా గెలిచారా అని నిలదీశారు. తుదకు చనిపోయిన సీట్లలో కూడా గెలవలేకపోయారని అన్నారు. జిహెచ్ఎంసిలో తామే గెలిచామన్నారు. ఇక్కడినుంచి ఒక్క జిఓ ఇయ్యగానే అక్కడినుంచి నేరుగా కోర్టుకు పోయి కేసులేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ సర్కారు నిర్ణయాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేసులేసిందని విమర్శించారు. కాంగ్రెస్ దుష్ట పన్నాగాలు తిప్పికొడతామన్నారు కెసిఆర్. త్వరలో రాష్ట్రమంతా పర్యటించి కాంగ్రెస్ దుష్ట నీతిని ఎండగతామన్నారు. కాంగ్రెస్ నేతలవి నోర్లా తాటిమట్టలా అని ప్రశ్నించారు. ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులో పిల్ వేయడం చూస్తే కాంగ్రెస్ చేస్తున్నది పిల్లి రాజకీయాలేనని అర్థమవుతుందన్నారు.