ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న, అయోమయ అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి , అటు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందన్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (k chandrashekar rao). ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న, అయోమయ అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి , అటు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందన్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (k chandrashekar rao) . ఆదివారం ప్రగతి భవన్ (pragathi bhavan) జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో (trs parliamentary party meeting) తెలంగాణ వరిధాన్య సేకరణలో స్పష్టతకోసం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి వున్నామని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామన్న ఆయన... తెలంగాణ రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని విడనాడాలని హితవు పలికారు.
ఈ వానాకాలంలో వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో పూటకో మాట మాట్లాడుతూ కిరికిరి పెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాల్సి వుండగా.. కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని( 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని కేంద్రం పాతపాటే పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సిఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ (piyush goyal) ని, అటు సిఎస్ తో కూడిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ప్రభుత్వ అధికారులను పలుమార్లు కలిసి విజ్జప్తి చేసినా, ఎటూ తేల్చక పోవడం పై ఈ సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Read:ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై లేవనెత్తండి: ఎంపీలకు కేసీఆర్ ఆదేశం
యాసంగి పంటకాలం ప్రారంభమైన నేపథ్యంలో.. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంపై, అలాగే యాసంగి వరిధాన్యాన్ని ఎంత కొంటారో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరింది. అయినప్పటికీ నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానం పై సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు కేసిఆర్ ఆదేశాల మేరకు ఉభయ సభల్లో తెలంగాణ రైతులు, ప్రజల తరపున గళాన్ని వినిపించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది.
వార్షిక ధాన్యసేకరణ కేలండర్‌ను విడుదల చేయాలని కేసిఆర్ చేసిన డిమాండ్‌ను అభినందిస్తూనే.. ఎటూ తేల్చని కేంద్రం వైఖరిపై సమావేశం విస్మయం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ విధానంపై పోరాడాలని నిర్ణయించింది. ధాన్యం దిగుబడిలో అనతి కాలంలో తెలంగాణ రైతు దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో.. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆశనిపాతంగా మారిందని సమావేశం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల సేకరణ విషయంలో కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉండాలని, అన్ని రాష్ట్రాలకు ధాన్యం సేకరణ విషయంలో ఏకరీతి విధానాన్ని అనుసరించాలని, ‘‘ సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం’’ ( Uniform National FoodGrain Procurement Policy ) కోసం పార్లమెంటులో డిమాండ్ చేయాలని సిఎం కెసిఆర్ ఎంపీలను ఆదేశించారు.
