వామన్ రావు దంపతుల కేసులో తమ పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్:వామన్ రావు దంపతుల కేసులో తమ పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సీఎం కేసీఆర్ బుధవారం నాడు సమాధానమిచ్చారు.
పెద్దపల్లి జిల్లాలో అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యను తాను కూడ ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ ఘటన దురదృష్టకరమైందిగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని తాను పోలీసులను ఆదేశించినట్టుగా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ ఘటనలో ఎవరూ పాత్రధారులుగా ఉన్న వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించానని ఆయన అసెంబ్లీలో చెప్పారు.ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్టుగా కేసీఆర్ తెలిపారు.ఈ కేసులో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడన్నారు. ఈ విషయం తెలుసుకోగానే ఆయనను పార్టీ నుండి తొలగించినట్టుగా కేసీఆర్ చెప్పారు.
ఈ కేసు విషయంలో రాజీ లేకుండా పోలీసు శాఖ వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఈ విషయమై ఎవరికీ కూడ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. ఎన్నికల సమయంలో తాను పోలీసు శాఖతో మాట్లాడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
