హైదరాబాద్‌ గ‌చ్చిబౌలిలోని వోక్రిడ్జ్ ఇంట‌ర్నేష‌న్ స్కూల్లో 12వ క్లాస్ గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌ల‌ను మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఈ స్కూల్లో చ‌దివిన ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు త‌న 12వ క్లాస్ గ్రాడ్యేయేషన్ పట్టాను అందుకున్నారు.

ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు. హైదరాబాద్‌ గ‌చ్చిబౌలిలోని వోక్రిడ్జ్ ఇంట‌ర్నేష‌న్ స్కూల్లో 12వ క్లాస్ గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌ల‌ను మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఈ స్కూల్లో చ‌దివిన ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు త‌న 12వ క్లాస్ గ్రాడ్యేయేషన్ పట్టాను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాతనాన‌మ్మ‌లు కేసీఆర్, శోభ దంపతులు.. తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లి అలేఖ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజానికి గొప్పగా సేవ చేయాలని హిమాన్షును కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు.

విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలను అందజేసింది. ఇందులో భాగంగా హిమాన్షుకు కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో ప్రతిభను ప్రదర్శించినందుకు గాను ఎక్స‌లెన్స్ అవార్డును అంద‌జేశారు. గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్న హిమాన్షు నేరుగా త‌న తాత వ‌ద్ద‌కు వ‌చ్చి ఆయ‌న చేతుల్లో గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను పెట్టి, పాదాల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకున్నారు. తన చేతుల్లో పెరిగి నేడు పట్టభ‌ద్రుడిగా ఎదిగిన మనుమన్ని హృదయపూర్వకంగా అభినందించారు కేసీఆర్. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హిమాన్షును సీఎం ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు కూడా తమ కుమారుడు సాధించిన ప్రతిభా నైపుణ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో హిమాన్షు అమ్మమ్మ, మేనమామలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హిమాన్షు రావుతో పాటు త‌న క్లాస్‌మేట్ ఆద్విత్ బిగాల కూడా గ్రాడ్యుయేషన్ పట్టాను పొందారు. బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల కుమారుడే ఆద్విత్ బిగాల‌. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల కూడా పాల్గొన్నారు.