హైదరాబాద్: తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

మంగళవారం నాడు మధ్యాహ్నం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిపై అనుమానాలు ఉన్నాయని ఆయన విమర్శించారు.

రాజకీయ ఒప్పందం, ఆర్ధిక లావాదేవీల కోసం ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.  ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

పోతిరెడ్డిపాడు విషయంలో గతంలో కేసీఆర్ బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలను మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు.

నీళ్ల కోసమే తెలంగాణ సాధించుకొన్న విషయాన్ని భట్టి గుర్తు చేశారు. తెలంగాణకు నీళ్లు లేకుండా ఏపీకి తరలిస్తోంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్వంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను  తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన తేల్చి చెప్పారు.

also read:పోతిరెడ్డిపాడుపై తెలంగాణ అభ్యంతరం: సీఎం జగన్ తో మంత్రి అనిల్ భేటీ

శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణాజలాలను ఎత్తి కుడి ప్రధాన కాల్వలో పోయడంతోపాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచేందుకుగాను విస్తరణ, లైనింగ్‌ పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

అంతేకాకుండా గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను సైతం 30వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచాలని తీర్మానించింది. ఈ పనులకు రూ.6,829.15 కోట్ల అంచనా వ్యయానికి పాలనా ఆమోదం తెలుపుతూ ఈ నెల 5వ తేదీన జీవో జారీచేసింది.