అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ మంగళవారం నాడు సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణాజలాలను ఎత్తి కుడి ప్రధాన కాల్వలో పోయడంతోపాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచేందుకుగాను విస్తరణ, లైనింగ్‌ పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

అంతేకాకుండా గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను సైతం 30వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచాలని తీర్మానించింది. ఈ పనులకు రూ.6,829.15 కోట్ల అంచనా వ్యయానికి పాలనా ఆమోదం తెలుపుతూ ఈ నెల 5వ తేదీన జీవో జారీచేసింది. 

also read:పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ సర్కార్ అభ్యంతరం: రేపు కృష్ణా రివర్ బోర్డు భేటీ

పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ విషయమై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టులో కూడ పిటిషన్ దాఖలు చేయాలని ప్లాన్ చేస్తోంది.

అయితే సముద్రంలో వృధాగా పోయే కృష్ణా జలాలను మాత్రమే తాము వినియోగించుకొనే ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఏపీకి చెందిన నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్, ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డిలు వేర్వేరుగా మీడియాతో చెప్పారు.

దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 11న సమావేశమై పోతిరెడ్డిపాడు విషయమై చర్చించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతున్న తరుణంలో సీఎం జగన్ తో మంత్రి అనిల్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. కృష్ణాలో వరద నీటిని రాయలసీమకు తరలించాలని జగన్ సర్కార్ ప్లాన్ చేసింది. వరద సమయంలో మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు ప్లాన్ చేసింది. 

ఈ విషయమై సీఎం జగన్ తో అనిల్ కుమార్ చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభ్యంతరాలు చెబుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించనుందోననే ఆసక్తి సర్వత్రా చర్చ సాగుతోంది. మరో వైపు ఈ నెల 13న కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్ సమావేశం కూడ జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ అభ్యంతరాలపై ఏం చెప్పాలనే విషయమై కూడ సీఎంతో మంత్రి అనిల్ చర్చించే అవకాశం లేకపోలేదు.