హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ ఎవరనేదానిపై వస్తున్న ఊహాగానాలకు గులాబీ దళపతి కేసీఆర్ చెక్ పెట్టారు. టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ ఆయన తనయుడు కేటీఆర్ అని మాటలతో కాకుండా చేతల్లో చూపించారు. జూనియర్ దళపతి కేటీఆర్ అంటూ తన నిర్ణయంతో స్పష్టం చేశారు కేసీఆర్ . 

టీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంద్ పదవిని తనయుడు కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించి ఇకపై కొడుకే బాస్ అంటూ చెప్పేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో దేశదృష్టిని ఆకర్షించిన కేసీఆర్ తన రాజకీయ పార్టీ  భారతదేశంలోనే అతి గొప్ప పార్టీగా రూపుదిద్దాలనే సంకల్పంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

దేశ రావజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బాధ్యతలను తనయుడు కేటీఆర్ కు అప్పగించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేశారు. 
 
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా పాలనలో గట్టి పట్టు సాధించారు. అంతేకాదు తన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించగలిగిన వ్యక్తిగా కూడా కేటీఆర్ గుర్తింపు పొందారు.  

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జూనియర్ గులాబీ దళపతి కేటీఆర్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పగ్గాలు తనయుడు కేటీఆర్ కు అప్పగించారు.  

గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ అద్భుత ప్రతిభ కనబరచడంతోపాటు పార్టీపరమైన కొన్ని కీలక నిర్ణయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడంతో కేటీఆర్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. 

అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన కేటీఆర్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ. కోటి ఎకరాలకు సాగునీరు అందించి రైతును రాజు చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో భారీ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాల్సిన భాధ్యత కేటీఆర్ పైనే ఉంది. అయితే ఇప్పటి వరకు భారీ నీటి పారుదల శాఖమంత్రిగా ఉన్నకేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ప్రాజెక్టుల విషయంలో చాలా పక్కా వ్యూహంతో ఉన్నారు. 

అలాగే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా కేటీఆర్ పైనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికి చేరడంతోపాటు వాటి పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా కేటీఆర్ పై ఉంది.  

ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ముందస్తు ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించారు. ఎన్నికల ఫలితాలను చూస్తే 
తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీపై ఎంతో విశ్వాసం ఉందన్న విషయం అవగతమవుతుంది. 

తెలంగాణ భవిష్యత్తుకు టిఆర్ఎస్ అత్యంత పటిష్టంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల మనోభవాలకు అనుగుణంగా టిఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కేటీఆర్ పై పడనుంది. 

అలాగే టీఆర్ఎస్ పార్టీ ముందున్న మరో సవాల్ స్థానిక సంస్థల ఎన్నికలు. జనవరిలోపు తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించుకోవలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ ఎన్నికల బాధ్యతలు మోయాల్సింది కేటీఆర్. 

ఇకపోతే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలు కేటీఆర్ మోయనున్నారు. కేటీఆర్ పనితీరు, నిబద్ధత, దార్శనికత,నాయకత్వ లక్షణాలు టిఆర్ఎస్ పార్టీని సుస్థిరంగా, సుభిక్షంగా నిలుపుతాయని కేసీఆర్ నమ్మకాన్ని కేటీఆర్ ఎలా నిలబెట్టుకుంటారో ముందున్న సవాల్ ను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కేటీఆర్ కు అసలు సవాల్ హరీష్ రావే...

పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..