తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని, ప్రభుత్వాన్ని కుమారుడి చేతిలో పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. జాతీయ రాజకీయాలపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టేందుకు వీలుగా కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను తారక రామారావు చేతిలో పెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే కేసీఆర్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికి పార్టీ బాధ్యత అప్పగించాలని తాను నిర్ణయించానని.. పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్‌కు బాధ్యతలను అప్పగించానని కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.