హన్మకొండ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు.. జంగా రాఘవరెడ్డిపై నాయిని తీవ్ర ఆరోపణలు
జనగామ మాజీ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి తీరుపై హన్మకొండ డీసీసీ నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండా తన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. జనగామ మాజీ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి తీరుపై హన్మకొండ డీసీసీ నాయిని రాజేందర్ రెడ్డి ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగంగా విమర్శలు గుప్పించడంతో కలకలం రేగింది. జనగామ జిల్లాకు రాఘవరెడ్డి డీసీసీ కాదని.. విపక్షాలకు లాభం కలిగిలా జంగా పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్యర్‌తో కలిసి తనకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు అతికించాడని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso REad: జనగామ పంచాయతీ.. జంగా రాఘవరెడ్డిపై టీపీసీసీ కన్నెర్ర, షోకాజ్ నోటీసులు జారీ
తన అనుమతి లేకుండా హనుమకొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. తనకే టికెట్ వస్తుందని అంటున్నాడని జంగాపై రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలోనూ జంగాపై ఫిర్యాదు చేశామని.. ఆయనకు పార్టీ పెద్దలు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారని నాయిని గుర్తుచేస్తున్నారు. ఆయన వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని.. జంగా ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నామని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. తీర్మానం కాపీని అధిష్టానానికి పంపించామని.. అక్కడి స్పందనను బట్టి , తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామని రాజేందర్ రెడ్డి వెల్లడించారు.