రంగారెడ్డి జిల్లాలో చిన్నారి దారుణ హత్య : ఇటుక బట్టీ వద్ద మృతదేహం లభ్యం

children death at ranga reddy district
Highlights

మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన చిన్నారి 

రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలోని చింతపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి దారుణ హత్యకు గురయ్యింది. ఇవాళ స్థానికంగా వున్న ఓ ఇటుక బట్టీ వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య కు సంబంధించిన వివరాలేవీ తెలియకుండా మిస్టరీగా మారింది. 

మూడు రోజుల నుండి పాప కోసం వెతుకుతుండగా ఇవాళ ఇటుకలను కాల్చడానికి ఉపయోగించే తౌడు లో చిన్నారి మఈతదేహం లభించింది. దీంతో పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్వాడ్ లను రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 ఈ హత్యపై ఇబ్రహీంపట్నం పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. బీహార్ కు చెందిన ఈ పాప తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలే ఉండటం, ఇందులో ఇద్దరు మానసిక అనారోగ్యంతో  బాధపడుతుండడంతో ఈ తల్లిదండ్రులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు. అలాగే ఈ పాపపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి చంపారా? అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. అయితే ఈ విషయం పోస్టు మార్టం తర్వాత తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.  

ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డిసిపి పరిశీలించారు. ఈ కేసు దర్యాప్తు త్వరితగతిన జరిపి నిందితులను పట్టుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
 

loader