దేశ విదేశాల్లో కెసినో ఈవెంట్స్ నిర్వహిస్తూ ఇటీవల వివాదంలో చిక్కుకున్న హైదరబాదీ చీకోటి ప్రవీణ్ కే టోపీ పెట్టారు దోపిడీదొంగలు. పార్క్ చేసిన చోటునుండే ఆయన ఇన్నోవా కారును మాయం చేసారు. 

హైదరాబాద్ : దేశంలోనే విదేశాల్లోనూ కేసినోలను నిర్వహించి ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి చీకోటి ప్రవీణ్. తాజాగా ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ సైదాబాద్ లోని ప్రవీణ్ ఇంటి ఆవరణలో పార్క్ చేసిన కారును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కారు కనిపించక పోవడంతో సిసి కెమెరాలను పరిశీలించగా దొంగలు కారుతో పరారవుతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో వెంటనే ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, వ్యాపార, సినీ రంగాలకు చెందినవారితో చీకోటి ప్రవీణ్ విదేశాల్లో కేసినో నిర్వహించినట్లు బయటపడింది. ఇందుకోసం హవాలా లావాదేవీలు జరిపినట్లు అనుమానించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) అతడిని అదుపులోకి తీసుకుని విచారించింది. అయితే ఈ వ్యవహారంలో పెద్దపెద్ద రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రమేయం వుందని... ఈ పేర్లు భయటపడకుండా ప్రవీణ్ కు హాని తలపెట్టే ప్రమాదముందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలాన్నిస్తూ గతంలో తన పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ ప్రవీణ్ కూడా పోలీసులను కోరారు. 

తనతో పాటు కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని... గన్ మెన్లను కేటాయించాలని ప్రవీణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తన ఇంటివద్ద గుర్తుతెలియని వ్యక్తులు నిత్యం తచ్చాడుతున్నారని... ప్రమాదం తలపెట్టేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్లుగా అనుమానం వుందని ఆందోళన వ్యక్తం చేసారు. కాబట్టి తమకు రక్షణ కల్పించాలని... రెక్కీ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చీకోటి ప్రవీణ్ కోరారు. 

Read More రూ. 7 కోట్ల వజ్రాభరణల చోరీ కేసులో పురోగతి.. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

ఈ క్రమంలోనే తాజాగా ప్రవీణ్ ఇంటి ఆవరణలో పార్క్ చేసిన కారు దొంగతనం ఆయన భద్రతపై అనుమానాలను మరింత పెంచింది. ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోవడంతో ఇంటి పరిసరాల్లోకి ప్రవేశించి మరీ దుండగులు కారును ఎత్తుకెళ్లారు. దీంతో చీకోటి ప్రవీణ్ ప్రొటెక్షన్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికయినా ప్రవీణ్ కు రక్షణ కల్పించాల్సిందిగా అనుచరులు, అభిమానులు కోరుతున్నారు.

ఇక ఇటీవల క్యాసినో నిర్వహణ కోసం చీకోటి ప్రవీణ్ హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు అనుమానిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర దేశాలలో భారీ ఏర్పాట్లతో కెసీనో ఈవెంట్స్ నిర్వహించిన చీకోటి ప్రవీణ్... తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి బంధువులను కూడా తీసుకెళ్లినట్టుగా ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్, మాధవరెడ్డిలపై ఫారెన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. చికోటీ వాట్సాప్ చాటింగ్, హవాలా లావాదేవీలకు సంబంధించి విచారణ కొనసాగించగా చాలామంది రాజకీయ నాయకుల పేర్లు బయటపడ్డాయి. 

ప్రవీణ్ వాట్సాప్ డేటాను సేకరించిన ఈడీ అధికారులకు పలువురు ప్రజా ప్రతినిధులతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పలువురు ప్రజాప్రతినిధులు, వారి వద్ద పనిచేసే వారిని ఈడీ విచారించింది. కొంత కాలం పోలీసుల అదుపులో వున్న ప్రవీణ్ బయటకు వచ్చి తిరిగి కెసినో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.