ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవి అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు పలు మలుపులు తిరిగి హైదరాబాద్ పోలీసుల చెంతకు చేరింది. ఏపి పోలీసులు ఈ కేసు విచారణను కొద్దిరోజుల క్రితమే తెలంగాణ పోలీసులకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కానీ వివిధ కారణాల వల్ల ఈ కేసులో ప్రధాన నిందితులను మాత్రం ఇప్పటివరకు అప్పంగించకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. అయితే తాజాగా ఈ హత్యకేసులో నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లను తెలంగాణ పోలీసులు నందిగామ నుండి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువచ్చారు. 

హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే ఈ నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు నేరుగా చింతలకుంటలోని ఓ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి ఈ ఇద్దరు నిందితులకు ఈ నెల 25వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించినట్లు సమాచారం.  

తన భర్త జయరాంను మేనకోడలు శిఖా చౌదరి చంపించిందని మృతుడి భార్య పద్మశ్రీ అనుమానాలు వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జయరాం హత్య కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపి పోలీసులతో చర్చించారు. దీంతో ఈ హత్య కేసును నందిగామ నుండి హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

మరిన్ని వార్తలు

జయరాం హత్యకేసులో ట్విస్ట్ : తెలంగాణ పోలీసులకు నిందితులను అప్పగించమన్న జైలు సిబ్బంది..?

జయరాం హత్య కేసు: నందిగామకు జూబ్లీహిల్స్ పోలీసులు